Saturday, November 23, 2024

దీపావళి వేళ కరెన్సీ వెలవెల.. తగ్గిన చలామణి, రెండు దశాబ్దాలలో ఇదే తొలిసారి

దీపావళి నాడు, ఆ తరువాత బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. కానీ ఆర్థిక రంగంలో ఆ కళ కన్పించలేదు. ఆ వారం రోజుల్లో దేశవ్యాప్తంగా కరెన్సీ చలామణి తగ్గిపోయింది. ఏకంగా రూ.7,600 కోట్ల మేర కరెన్సీ చలామణి (సీఐసీ-కరెన్సీ ఇన్‌ సర్క్యులేషన్‌) తగ్గిపోయిందని గురువారం విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. అయితే, డిజిటల్‌ చెల్లింపులపై ప్రజలు ఎక్కువగా ఆధారపడటం వల్లే ఈ పరిణామం సంభవించిందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఆర్థిక నిపుణుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత ఆర్థికరంగంలో వ్యవస్థీకృత మార్పు చోటుచేసుకుంటున్నదని, అందుకు తాజా పరిణామం ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. 2009 దీపావళి సమయంలోనూ ఈ తరహా పరిణామం సంభవించిందని, అప్పట్లో రూ.950 కోట్ల మేర కరెన్సీ చలామణి తగ్గిపోయిందని గుర్తు చేశారు. అయితే, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొనడం, ఆర్ధిక కార్యకలాపాలు మందగించ డంవల్ల అలా జరిగిందని, ఈసారి అలాంటి కారణాలు ఏవీ లేవని చెప్పుకొచ్చారు. సాంకేతిక రంగంలో వచ్చిన అత్యాధునిక నవకల్పనలవల్ల భారత్‌లో చెల్లింపుల విధానంలో పెనుమార్పులు వచ్చాయి. భారత ఆర్థిక వ్యవస్థ నగదు చెల్లింపుల విధానం నుంచి స్మార్ట్‌ ఫోన్లలో డిజిటల్‌ చెల్లింపుల మారిందని వివరించారు.

చలామణీలో కరెన్సీ తగ్గుదల వల్ల బ్యాంకుల్లో నగదు నిల్వల నిష్పత్తి తగ్గుతుందని, నగదు బదలీలపై ఇది సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పారు. డిజిటల్‌ ఎకానమీ దిశగా కేంద్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నందువల్లే ఇది సాధ్యమవుతోందని ఈ నివేదిక ప్రశంసించింది. యూపీఐ, వాలెట్‌, ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ – పీపీఐ వంటి విధానాల వల్ల డిజిటల్‌ చెల్లింపులు సులువుగా, చౌకగాను జరిగిపోతున్నా యని, చివరకు బ్యాంక్‌ అకౌంట్లు లేనివారికి కూడ ఇది సాధ్యమవుతోందని ఆ నివేదిక వెల్లడించింది. రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ 16 శాతం, ఐఎంపీఎస్‌ 12 శాతం, ఈవాలెట్‌ 1 శాతం వాటా కలిగి ఉన్నాయని పేర్కొంది. ఇక నగదు చెల్లింపుల్లో (సీఐసీ) గణనీయమైన తగ్గుదల నమోదైందని, 2016-20 మధ్య 88 శాతం తగ్గుదల నమోదు కాగా, 2027 నాటికి మరో 11.15 శాతం తగ్గుతుందని అంచనావేసింది. ఇక 2016-22 మధ్య డిజిటల్‌ చెల్లింపుల వాటా స్థిరంగా పెరుగుతూ వచ్చిందని, 11.26 శాతం నుంచి ఏకంగా 80.4 శాతానికి పెరిగిందని, ఇది 2027 నాటికి 88 శాతానికి చేరుతుందని అంచనావేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement