ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలపై చర్చలు జరపడానికి ప్రపంచ నాయకులు ఈ వారం దావోస్‌కు తరలి వస్తున్నారు. రెండు ప్రధాన యుద్ధాలు, షిప్పింగ్ సంక్షోభం, ప్రభుత్వ సంస్థలపై సైబర్‌ఎటాక్‌లు, వాతావరణ అత్యవసర పరిస్థితి తదితర సంక్లిష్ట సవాళ్లు ఎజెండాగా చర్చలు జరగనున్నాయి. కానీ ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు అసాధారణంగా 88.1 ట్రిలియన్ డాలర్ల రుణభారాన్ని కలిగివున్నాయి.
ఈ మొత్తం దాదాపు ప్రపంచ వార్షిక ఆర్థిక ఉత్పత్తికి సమానం. ఇలాంటి ఆర్థిక ఒత్తిళ్ల మధ్య భవిష్యత్ ఆలోచనలను కార్యరూదం దాల్చేలా వ్యవహరించడం కష్టతరమని నిపుణులు పేర్కొంటున్నారు. మహమ్మారి సమయంలో పేరుకుపోయిన రుణభారానికి తోడు, ఈ సంవత్సరం కొత్తగా తీసుకున్న రుణాలు అనేక పెద్ద ఆర్థిక వ్యవస్థలలో కొత్త రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.
ఇలాంటి సమయంలో ఆర్థిక మాంద్యం, మ#హమ్మారి లేదా యుద్ధాల వంటి షాక్‌లకు ప్రభుత్వాలు శీఘ్రంగా స్పందించే సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తున్నాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఇప్పుడు ప్రపంచం ముందు కొత్త సంక్షోభం లేకపోయినా, పెరుగుతున్న రుణసేవల ఖర్చులు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, వృద్ధుల బాధ్యతల్ని నెరవేర్చే ప్రయత్నాలను అడ్డుకుంటుంది. వరుస బడ్జెట్ కోతల తర్వాత అనేక దేశాల్లో ప్రజా సేవలు ఇప్పటికే దెబ్బతిన్నాయి.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, రుణ భారాలు పెరుగుతున్నందున, ప్రభుత్వాలు ఇప్పటికే ఉన్న బాధ్యతలకు, ప్రాథమిక సేవలకు తగినంతగా నిధులు సమకూర్చడానికి ఎక్కువ రుణాలు తీసుకోలేక పోవచ్చని ఈ నివేదిక అభిప్రాయపడింది. ప్రభుత్వం తన రుణానికి ఆర్థిక సహాయం చేయలేకపోతే ”ఆకస్మిక, బాధాకరమైన” ఖర్చుల కోతలు లేదా పన్ను పెంపుదల అమలు చేయవలసి వస్తుంది అని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ద్రవ్య విధాన కమిటీ మాజీ సభ్యుడు మైఖేల్ సాండర్స్ హెచ్చరించారు.