గ్రీన్ ఎనర్జీలో అదానీ గ్రూప్ 70 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుందని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. దేశ ఇంధన అవసరాలను ఇది పూర్తిగా మార్చగలదని తెలిపారు. గ్రీన్ ఎనర్జీపై నమ్మకం, విశ్వాసంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. కంపెనీ ఇప్పటికే సోలార్ పవర్‌లో అగ్రగామి సంస్థగా ఉందన్నారు. భవిశ్యత్ ఇంధనం గ్రీన్ హైడ్రోజనే అని కంపెనీ వాటాదారుల సమావేశంలో అదానీ వివరించారు. కంపెనీకి ఇప్పటికే సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిలో తన శక్తిసామర్ధ్యాలను చాటుకుందన్నారు. ఈ పోటీలో కంపెనీ ముందుటుందని చెప్పారు. ప్రస్తుతం మన దేశం గ్యాస్, చమురు దిగుమతులపై ఆదారపడుతున్నామని , భవిష్యత్‌లో మన దేశం క్లీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా నిలుస్తుందన్నారు. ఈ రంగంలో మన దేశ ప్రయాణం అసాధారణ రీతిలో ఉంటుందన్నారు.
టాప్‌గేర్‌లో కంపెనీ..
సాంప్రదాయేతర ఇంధన రంగంలో ప్రస్తుతం కంపెనీ అతి పెద్ద సంస్థగా ఎదిగిందన్నారు. గత 12 నెలలుగా అదానీ గ్రూప్ అనేక రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించినట్లు షేర్లు హోల్డర్లకు వివరించారు. ఒకే ఒక్క దెబ్బకు కంపెనీ దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా ఏర్పడిందని అదానీ చెప్పారు. కంపెనీ నిర్వహిస్తున్న విమానాశ్రయాల పరిసరాల్లో కమ్యూనిటి ఆధారిత బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భారత్ వృద్ధితోనే కంపెనీ అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. కంపెనీ కొన్ని అతి పెద్ద మౌళిక సదుపాయాల ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లను పొందిందన్నారు. పోర్టులు, లాజిస్టిక్స్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ రంగాల్లోనూ, సిటీ గ్యాస్, పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ సరఫరా వంటి రంగాల్లో కంపీనీ క్రమంగా మార్కెట్ వాటాను పొంచుకుంటోందని వివరించారు.
సిమెంట్‌లోనూ రెండో స్థానం..
అదానీ విల్మార్ ఐపీఓతో దేశంలోనే అతి పెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా అవతరించేలా చేసిందన్నారు. హోలీసిమ్‌కు చెందిన ఏసీసీ, అంబుజా సిమెంట్స్ , వాటి ఆస్తుల కొనుగోలుతో దేశంలోనే రెండో అతి పెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా అవతరించినట్లు అదానీ వివరించారు. బిజినెస్ విషయంలో కంపెనీ అనుసరిస్తున్న విదానం విజయవంతమైనదనడానికి సాధించిన విజయాలే నిదర్శనమన్నారు. వీటితో పాటు కంపెనీ డేటా సెంటర్లు, డిజిటల్ సూపర్ యాప్స్, ఇండస్ట్రీయల్ క్లౌడ్, డిఫెన్స్, ఎయిరోస్పేస్, మెటల్స్, మెటీరియల్స్ వంటి అనేక రంగాల్లోకి కంపెనీ ప్రవేశిస్తోందన్నారు. ప్రభుత్వం విజన్ అయిన ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిగా కంపెనీ అనేక రంగాల్లోకి విస్త్రతంగా ప్రవేశిస్తోందని తెలిపారు.
60 వేల కోట్లు వితరణ..
ఈ సంవత్సరం తాను 60వ వసంతంలోకి ప్రవేశిస్తున్నానని, తన తండ్రి శాంతిలాల్ అదానీ 100వ జయంతి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా అదానీ కుటుంబం మొత్తం కలిపి గ్రామీణ ప్రాంతాల్లో విద్యా, వైద్యం, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక ధార్మిక కార్యక్రమాలకు 60 వేల కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భవిష్యత్ ఇండియాను నిర్మించేందుకు ఈ మూడు అంశాలు చాలా ప్రధానమైవని భావిస్తున్నామని, లక్షలాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయాల్సిన అవసరం ఉందన్నారు. అదానీ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా (15.95 లక్షల కోట్లు) ఉందని చెప్పారు. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బిలి యన్స్ డాలర్లను సేకరించగల సామర్ధ్యం కలిగి ఉందన్నారు.
విదేశాల్లోనూ విస్తరణ..
అనతికాలంలోనే అదానీ గ్రూప్ సాధించిన విజయాలను ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు గుర్తించాయని, కంపెనీతో కలిసి పని చేసేందుకు సంప్రదిస్తున్నాయని వెల్లడించారు. 2022లో భారత దేశం అవత కూడా కంపెనీ తన పునాదిని విస్తృతం చేయనుందని ఆయన ప్రకటించారు.