ట్విటర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కంపెనీలో భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారని వార్త కథనాలు వెలువడ్డాయి. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని ఆయన నిర్ణయించుకున్నారని, ఇందు కోసం తొలగించే ఉద్యోగుల జాబితాను సిద్ధం చేశారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల కోతలను శుక్రవారం నుంచే మొదలు కానున్నాయని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
శుక్రవారం నుంచి ట్విటర్లో ఉద్యోగుల తొలగింపు మొదలవుతుందని సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఈ కథనం పేర్కొంది. ఉద్యోగుల కోతపై శుక్రవారం ఉదయం 9 గంటలకు సిబ్బందిని అప్రమత్తం చేస్తామని కంపెనీ ఈ-మెయిల్లో వెల్లడించిందని తెలిపింది. ఉద్యోగుల కోలు మొదలవుతున్న దృష్ట్యా సిబ్బంది ఇంటికి వెళ్లొచ్చని, శుక్రవారం ఆఫీసుకు రావొద్దని మెయిల్లో సూచించారని పేర్కొంది.
ట్విటర్‌ను ఆరోగ్యకరమైన మార్గంలో ఉంచే ప్రయత్నంలో భాగంగా సిబ్బందిని తగ్గించుకునే క్లిష్టమైన ప్రక్రియను మొదటి పెట్టాల్సి వచ్చిందని ఉద్యోగులకు కంపెనీ పంపించిన ఈ-మెయిల్లో తెలిపిందని న్యూయార్క్ టైమ్స్ కథనంలో వెల్లడించింది. ఉద్యోగులు ఆఫీసులో ఉన్నా, ఆఫీస్‌లకు బయలుదేరినా వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని ఆ సమాచారంలో కోరింది. తొలగించాలనుకున్న ఉద్యోగులకు వారి వ్యక్తిగత ఈ-మెయిల్‌కు సమాచారం ఇచ్చారని, కొనసాగించే వారికి మాత్రం వారి వర్క్ ఈ-మెయిల్ ఐడీల ద్వారా సమాచారం ఇచ్చినట్లు రాయిటర్స్ తన కథనంలో వెల్లడించింది.
మీడియా కథనాల ప్రకారం దాదాపు 3,700 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు తెల్సింది. ఈ సంఖ్యపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ట్విటర్ మౌలిక సదుపాయాల ఖర్చును ఏడాదికి ఒక బిలియన్ డాలర్ల వరకు తగ్గించుకోవాలని ట్విటర్ టీమ్‌ను ఎలాన్ మస్క్ ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఇండియలోనూ కోతలు
ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలన్న ట్టిటర్ అధినేత నిర్ణయంతో దాని ప్రభావం భారత్‌పైనా పడింది. మన దేశంలో ఉన్న ట్విటర్లో పాలసీ, కమ్యూనికేషన్, ఇంజనీరింగ్, డెవలప్మెంట్ వంటి రంగాల్లో ఉద్యోగుల కోతలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అమెరికాలోని ప్రధాన కార్యాలయంతో పాటు, ఇండియాలోనూ పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులను తొలగించారని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇండియాలో అన్ని విభాగాల్లో కలిపి 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. తాను తన సిస్టమ్‌ను లాగిన్ కాలేకపోయానని, ఇలా చాలా మంది ఉద్యోగులకు జరిగిందని ట్విటర్ ఇండియాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
వీరిలో చాలా మందికి వ్యక్తిగత ఈ-మెయిల్స్‌కు తొలగించినట్లు సమాచారం ఇచ్చారని ఈయన తెలిపారు. చాలా ఉద్యోగులు తమ ఉద్యోగం ఉంటుందోలేదోనని ఆందోళనలో ఉన్నారని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మొదటి నుంచి అనుమానాలను నిజం చేస్తూ ట్విటర్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రక్రియను ఎలాన్ వస్క్ ప్రారంభించారని ఈ కథనాలు పేర్కొన్నాయి. దీనిపై కంపెనీ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.