న్యూఢిల్లి : దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 2.13 లక్షల పైమాటేనని పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ తెలిపింది. ఏటీఎంల్లో 47 శాతానికిపైగా ఏటీఎంలు రూరల్, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు సెప్టెంబర్ 2021 నాటికి 2,13,145 ఏటీఎంలను ఇన్‌స్టాల్ చేశాయి. అదనంగా మరో 27,837 వైట్ లేబుల్ ఏటీఎంలు (డబ్ల్యూఎల్‌ఏ)లను డబ్ల్యూఎల్‌ఏ ఆపరేటర్లు ఇన్‌స్టాల్ చేశారని ఆర్థిక శాఖా సహాయమంత్రి భగ్వత్ కరాద్ లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చారు.
ఏటీఎంలలో 47 శాతం రూరల్, సెమీ- అర్బన్ కేంద్రాల్లో ఇన్‌స్టాల్ చేసినవేనని ఆయన చెప్పారు. 2022 నాటికి ఎన్ని ఏటీఎంలను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారనే ప్రశ్నకు బదులిస్తూ.. ప్రతి ఏడాది 1000 ఏటీఎంలను ఇన్‌స్టాల్ చేస్తున్న డబ్ల్యూఎల్‌ఏ ఆపరేటర్లను ఆర్బీఐ ప్రశంసిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 1:2:3 శాతం చొప్పున ఏటీఎంల ఇన్‌స్టాల్‌మెంట్ జరుగుతోందని పేర్కొన్నారు. మూడు, నాలుగో విడత కేంద్రాల్లో విస్తృతంగా బ్యాంకింగ్ సర్వీసులు అందించాలనే లక్ష్యంతో డబ్ల్యూఎల్‌ఏ స్కీమ్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.