Sunday, November 3, 2024

Maruti EVX | వచ్చే సంవత్సరం మార్కెట్‌లోకి రానున్న మారుతీ ఈవీ

దేశంలో కార్ల తయారీలో అగ్రగామి కంపెనీగా ఉన్న మారుతీ సుజుకీ వచ్చే సంవత్సరం తన మొదటి విద్యుత్‌ కారును మార్కెట్‌లోకి తీసుకు రానుంది. ఇది టాప్‌ ఎండ్‌ ఎస్‌యూవీగా ఉంటుందని మారుతీ సుజుకీ కార్పోరేట్‌ అఫెర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ భారతీ గురువారం నాడు ప్రకటించారు. గుజరాత్‌లోని హన్సాల్‌పూర్‌ ప్లాంట్‌ నుంచి కంపెనీ విద్యుత్‌ కార్లను ఉత్పత్తి చేయనుంది.

ఒకసారి ఛార్జ్‌ చేస్తే ఈ కారు 550 కి.మీ. రేంజ్‌ ఇస్తుందని ఆయన తెలిపారు. ఇందులో 60 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీని పొందుపరుస్తున్నారు. గుజరాత్‌లోని ఈ ప్లాంట్‌లో విద్యుత్‌ కార్ల తయారీకి మారుతీ సుజుకీ 3,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు గత సంవత్సరం ప్రకటించింది. ఈ మేరకు గురజాత్‌ ప్రభుత్వంతో 2022 మార్చిలో అవగాహన ఒప్పందం చేసుకుంది.

హన్సల్‌పూర్‌ ప్లాంట్‌ను మారుతీ సుజుకీ 2017 ఫిబ్రవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. సుజుకీ మోటార్‌ గుజరాత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎంజీ) మారుతీసుజుకీ కంపెనీ పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా ఉంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో కొత్త ఎస్‌యూవీ విద్యుత్‌ కారును మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ ప్లాంట్‌లో తయారవుతున్న విద్యుత్‌ కార్లను ఎగుమతి కూడా చేస్తామని రాహుల్‌ భారతీ తెలిపారు.

మారుతీ సుజుకీ కంపెనీ తన విద్యుత్‌ కాన్సెప్ట్‌ కారును 2023 ఆటో ఎక్స్‌పోలో ఈవీఎక్స్‌ పేరుతో ప్రదర్శించింది. గుజరాత్‌లోని ప్లాంట్‌ నుంచి 30 లక్షల యూనిట్ల ఉత్పత్తిని అధిగమించిందని ఆయన చెప్పారు. ఈ యూనిట్‌ వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 7.5 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ ప్లాంట్‌ నుంచి కంపెనీ బాలినో, స్విఫ్ట్‌, డిజైర్‌, ఫ్రాంక్స్‌, టూర్‌ ఎస్‌ మోడల్స్‌ను తయారీ చేస్తోంది. వీటితో పాటు ఇక నుంచి విద్యుత్‌ కార్లను కూడా ఇక్కడి నుంచే ఉత్పత్తి చేయనుంది. ఈ విద్యుత్‌ కారుకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే కంపెనీ ప్రకటించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement