బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరుగుతుండటంలో మన మార్కెట్‌లోనూ ప్రభావం పడుతుంది. సోమవారం నాడు ఢిల్లి స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారట్ల ధర ఒకేసారి 1400 పెరిగి, 60,100 రూపాయలుకు చేరింది. వెండి ధర కూడా 1860 పెరిగి 69,340 రూపాయలకు చేరింది. ఎంసీఎక్స్‌లో చివరకు 59,536 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2005 డాలర్లుగా ఉంది. వెండి 22.55 డాలర్లుగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. గత సంవత్సరం మార్చిలో ఔన్స్ బంగారం ధర 2052 డాలర్లకు చేరింది. తరువాత క్రమంగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది.
ఈక్విటీ మార్కెట్లు రాణించడం వల్ల బంగారం ధర తగ్గింది. మార్చి 8 నాటికి 1818 డాలర్లకు చేరింది. దీని వల్ల మన దేశంలో 10 గ్రాముల ధర 56-57 వేల మధ్య ట్రేడయ్యింది. బ్యాంకింగ్ రంగంలో వరసగా పరిణామాలు జరగడంతో మళ్లి బంగారం ధరలు పెరుగుతున్నాయి. కేవలం 10 రోజుల్లోనే బంగారం 10 గ్రాముల ధర 56 వేల నుంచి 60 వేల స్థాయికి చేరింది. బ్యాంక్‌ల పతనంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల గోల్డ్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.
దీని వల్ల అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2వేల డాలర్లకు చేరింది. మరోసారి అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే దాని ప్రభావం బంగారం రేట్లపై పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత వారం బులియన్ మార్కెట్ 6.5 శాతం పెరిగింది. 2020 మార్చి తరువాత ఈ స్థాయిలో బులియన్ మార్కెట్ పెరగడం ఇదే మొదటిసారి. స్టాక్ మార్కెట్‌లో ఏర్పడుతున్న అనిశ్చితి మూలంగానే బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.