Tuesday, November 26, 2024

ఉద్యోగులను తొలగించిన హ్యాపియెస్ట్‌ మైండ్స్‌.. మూన్‌లైటింగ్‌ చేస్తున్నారని వేటు

ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం(మూన్‌లైటింగ్‌) తమకు ఆమోదయోగ్యం కాదని ప్రముఖ ఐటీ సంస్థ హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. అలా చేసిన కొంత మంది ఉద్యోగులకు తొలగించినట్లు వెల్లడించింది. ఒక సంస్థకు సేవలు అందిస్తూ మరో కంపెనీకి కూడా పని చేయడం ఉద్యోగ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. గత సంవత్సర కాలంగా మూన్‌లైటింగ్‌ పాల్పడిన కొంత మంది ఉద్యోగులను గుర్తించి, ఉద్యోగాల నుంచి తొలగించామని తెలిపింది. ఎంత మందిని ఇలా తొలగించింది మాత్రం సంస్థ వెల్లడించలేదు.

మూన్‌లైటింగ్‌ను అనుమతించబోమని తాము ఉద్యోగులకు చాలా కాలంగా హెచ్చరిస్తూ వస్తున్నామని తెలిపింది. ఒక కంపెనీలో ఉద్యోగం చేయడమంటే, ఒప్పందం కుదుర్చకున్నట్లేనని, వారు దానికి మాత్రమే పని చేయాలని హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ స్పష్టం చేసింది. ఇలా చేస్తున్న వారిని తొలగించడం ద్వారా మిగతా వారికి ఒక సందేశం పంపించినట్లు పేర్కొంది. తమ సంస్థలో పని చేస్తూ, కొన్ని గంటలపాటైనా సరే ఇతర సంస్థలకు పని చేయడానికి తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇక్కడ చేస్తున్న పనికి సంబంధంలేని పని చేస్తే మాత్రం తమకు అభ్యంతరంలేదని తెలిపింది. ఉదాహరణకు వారాంతాల్లో ఏదైనా స్కూల్‌కు వెళ్లి బోధించడం, ఇతర సోషల్‌ యాక్టివిటీస్‌ చేసుకోవచ్చని , మిగిలిన సమయమంతా కంపెనీకే కేటాయించాలని హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ కార్యనిర్వాహ క ఉపాధ్యక్షుడు జోసెఫ్‌ అనంతరాజు చెప్పారు.

మూన్‌లైటింగ్‌ ఇంకా తమ కంపెనీలో పెద్దగా విస్తరించలేదన్నారు. ఈ సమస్యను నివారించేందుకే తమ ఉద్యోగులను ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దీని వల్ల వారు ఇతర కంపెనీలకు పని చేసే సమయం లభించదన్నారు. మూన్‌లైటింగ్‌పై ఐటీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల విప్రో సైతం ఇలాంటి వాటిని సహించబోమని స్పష్టం చేసింది. ఇలా మూన్‌లైటింగ్‌కు పాల్పడిన 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు.

మరో వైపు ముందుగా అనుమతి తీసుకుని ఇలాంటి ఉద్యోగాలు చేసుకునేందుకు ఇన్ఫోసిస్‌ తన ఉద్యోగులకు అనుమతి ఇచ్చింది. రెండో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఫోసిస్‌కు పోటీగా ఉండకూడదని కండిషన్‌ పెట్టింది. సంస్థ ప్రయోజనాలు, క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకూడదని స్పష్టం చేసింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడే ఉద్యోగులను తొలగించకూడదని, సమస్యను పరిష్కరించుకోవాలని, వారి పట్ల కఠిన వైఖరి సరికాదని టీసీఎస్‌ అభిప్రాయపడింది. మూన్‌లైటింగ్‌ను తాము కూడా అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement