Tuesday, November 26, 2024

వృద్ధిరేటు 7.7శాతమే? అంచనాలను తగ్గించిన మూడీస్‌

భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను మూడీస్‌ సంస్థ 7.7 శాతానికి తగ్గించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, అసమాన రుతుపవనాలు, ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల వచ్చే త్రైమాసికాల్లో ప్రతికూల పరిస్థితులు తప్పవని పేర్కొంది. మే నెలలో 8.8శాతంగా వృద్ధిరేటును అంచనా వేసిన మూడీస్‌ తాజా అంచనాల్లో 1.1 శాతం కోత విధించింది. 2020 కరోనా మహమ్మారి ముట్టడి వేళ 6.7 శాతానికి పతనమైన వృద్ధిరేటు మరుసటి ఏడాది (2021) 8.3 శాతానికి చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి దేశీయ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరింత పెరగకుండా ఉండేందుకు ఆర్‌బీఐ సహేతుకమైన కఠిన వైఖరిని కొనసాగించవచ్చని మూడీస్‌ పేర్కొంది. జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ గణాంకాలు వెల్లడైన మర్నాడే మూడీస్‌ నివేదిక బహిర్గతమైంది. దీని ప్రకారం మూడు నెలల కాలంలో ఆర్థికవ్యవస్థ 13.5 శాతం విస్తరించింది. ఇది జనవరిలో నమోదైన 4.1 శాతం కంటే చాలా ఎక్కువ. 2022-23ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన హై ఫ్రీక్వెన్సీ డేటా బలమైన, విస్తృత-ఆధారిత అంతర్లీన వేగాన్ని చూపుతుందని మూడీస్‌ తెలిపింది.

ఏదైమైనప్పటికీ, వృద్ధిని, ద్రవ్యోల్బణాన్ని సమతుల్యం చేయడం ఆర్‌బీఐకి సవాల్‌గా మారిందని పేర్కొంది. అదే సమయంలో రూపాయి విలువ డాలర్‌తో 7 శాతం క్షీణించడం దిగుమతులపై మరింత ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ద్రవ్యోల్బణానికి సంబంధించి, ప్రస్తుత సంవత్సరం జులై-డిసెంబర్‌ కాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు బలహీన పడతాయని, 2023లో మరింత తగ్గుతాయని మూడీస్‌ అభిప్రాయపడింది. గ్లోబల్‌ కమొడిటీ ధరల్లో వేగంగా తగ్గుదల వృద్ధికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇక చైనా జీడీపీ వృద్ధి అంచనా ఈ ఏడాది 3.5 శాతంగా నిర్ణయించబడింది. మే అంచనాల కంటే (4.5శాతం) తక్కువ. 2023లో చైనా ఆర్థిక వ్యవస్థ 4.8 శాతం వృద్ది చెందుతుందని మూడీస్‌ అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement