ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ సంఖ్యలో విమానాలను భారత్‌కు చెందిన విమానయాన సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే వివిధ సంస్థలు 1,000 కిపైగా విమానాలను ఆర్డర్ ఇచ్చాయి. ఇందు కోసం భారీగా నిధులను ఖర్చు చేయనున్నాయి. వచ్చే సంవత్సరం నాటికి 10.9 కోట్ల మంది ప్రయాణికులు సామర్ధ్యంతో న్యూఢిల్లి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రెడీ కానుంది.
యునైటెడ్ స్టేట్స్‌లోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం తరువాత అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయంగా న్యూఢిల్లి ఎయిర్‌పోర్టు నిలువనుంది. దేశంలో భారీ పెట్టుబడులతో విమానాశ్రయాలను నిర్మిస్తున్నారు. ఈ విషయంలో ప్రపచం వేదికపై భారత్ గర్వంగా నిలవగలదు.
మరోవైపు మన దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే అది పెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవనుంది. దేశంలో మధ్య తరగతి ప్రజల కోరికలను తీర్చేదిశగా భారత్ అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగానే దేశంలో విమానాశ్రయాల నిర్మాణం జరుగుతోంది.
ఎయిర్‌ట్రావెల్ తక్కువే…
140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో విమానంలో ప్రయాణించాలనే కోరిక, కల ఉన్నప్పటికీ, ఆర్ధికంగా ఎక్కువ మందికి విమాన ప్రయాణాలు అందుబాటులో లేవు. మన దేశ జనాభాలో కేవలం 3 శాతం మం ది మాత్రమే విమానాల్లో ప్రయాణిస్తున్నారు. సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, విద్యార్ధులు, వ్యాపారులు ఇలా కొన్ని వర్గాలు విమానాల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు.
భారత్‌లో రానున్న రెండు మూడు సంవత్సరాల్లో విమానయాన రంగం మరింత అభివృద్ధి చెందాల్సి ఉందని, ఇండియన్ ఏవియేషన్ ఆదాయం సాధిస్తుందని నిరూపించుకోవాల్సి ఉందని క్యాపా ఇండియా సీఈఓ కపిల్ కౌల్ అభిప్రాయపడ్డారు. విమానప్రయాణికుల రద్దీ పెరిగితే కార్గో కూడా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం విదేశీ పెట్టుబడుల విషయంలో ఇండియన్ ఏవియేషన్ ఇంకా వెనుకబడే ఉందన్నారు.
ఢిల్లి విమానాశ్రయం 2012లో 30 మిలియన్ల మంది ప్రయాణించేందుకు వీలుగా నిర్మించారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయాన్ని భారీ స్థాయిలో విస్తరిస్తున్నారు. ఈ జులైలో 4వ రన్‌వేను ప్రారంభించారు. ఎయిర్‌పోర్టులో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. లగేజీ విషయంలో ప్రతి గంటకు 6 వేల బ్యాగ్‌లను హ్యాండిల్ చేస్తున్నారు.
ఎయిర్ ఇండియాతో పాటు…
దేశంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంతో పాటు, ఉన్న వాటి సామర్ధ్యాన్ని పెంచుతున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు పెరుగుతున్నారు. దీనికి అనుగుణంగా ఆయాన విమానాయన సంస్థలు కొత్త విమనాలకు ఆర్డర్లు ఇస్తున్నాయి. ఈ విషయంలో ఎయిర్ ఇండియా, ఇండిగో అగ్రస్థానంలో ఉన్నాయి.
దాదాపు అన్ని ఆర్డర్లను అమెరికాకు చెందిన బోయింగ్, యూరోప్‌కు చెందిన ఎయిర్‌బస్సు కంపెనీలకు ఇచ్చారు. ఎయిర్ ఇండియా ఎయిర్ బస్సుకు 250 విమానాలు, 220 విమానాలను బోయింగ్ కంపెనీ నుంచి కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఎయిర్ ఇండియా 70 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనుంది. ఈ సంవత్సరం జూన్‌లో ఇండిగో 500 కోత్త ఎయిర్‌బస్సు ఏ230 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది.
దేశీయంగా ప్రయాణికుల సంఖ్య 2022 నుంచి 36 శాతం పెరిగారు. కరోనా తరువాత అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య మాత్రం అనుకున్న స్థాయిలో పెరగలేదు. 21 వేల రూపాయల ఛార్జీతో వెళ్లకలిగే అజర్‌బైజాన్, కెన్యా, వియత్నాం దేశాలకు ఢిల్లి, ముంబై వంటి ప్రాంతాల నుంచి డైరెక్ట్ సర్వీస్‌లు నడుస్తున్నాయి. దేశీయంగా చూస్తే ఢిల్లి-ముంబై రూట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఒకటిగా ఉంది.
బెంగళూర్ ఎయిర్‌పోర్టు నుంచి కూడా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం 148 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. 2030 నాటికి వీటి సంఖ్యను 230కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం 15 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనుంది. మన దేశంలో తలసరి విమాన ప్రయాణికుల సంఖ్య చైనా, అమెరికా కంటే చాలా వెనుకబడి ఉంది.
దేశంలో ప్రైవేట్ రంగంలోకి వస్తున్న చాలా సంస్థలు ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ రంగంలో విమానయాన సంస్థ లేకుండా పోయింది. మన కంటే ఆర్ధికంగా చాలా వెనుకబడిన దేశాల్లో కూడా ప్రభుత్వ రంగంలో విమానయాన సంస్థలు నడుస్తున్నాయి. జనాభాలో ప్రపంచంలో మొదటి స్థానంలోఉన్న మనకు మాత్రం సొంత విమానయాన సంస్థ లేదు.
దీని వల్ల సామాన్యులకు రాయితీ ధరలో ప్రయాణం కష్టంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్ధికంగా దెబ్బతిని కొన్ని సంస్థలు మూతపడుతుండటంతో ఈ రంగంలో ఆర్ధికంగా బలంగా ఉన్న సంస్థలకు క్రమంగా గుత్తాధిపత్యం వస్తుంది. దీని వల్ల విమాన ఛార్జీల విషయంలో ఆయా సంస్థల నిర్ణయాలకు తిరుగు ఉండదని ఈ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.