మన దేశ ఆర్ధిక వ్యవస్థ పనితీరు అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే, జీ 20 దేశాల కంటే మెరుగ్గానే ఉందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నెలవారి నివేదిక పేర్కొంది. చాలా దేశాల కంటే ద్రవ్యోల్బణం నియంత్రణ విషయంలోనూ మన దేశం మెరుగ్గానే ఉందని తెలిపింది. భౌగోళిక రాజకీయ పరిస్థితి మరింత క్షిణించే అవకాశం ఉందని పేర్కొంది. దీని వల్ల 2023లో ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు పునరుజ్జీవనం పొందవచ్చని శనివారం నాడు విడుదల చేసిన నెలవారి ఆర్థిక నివేదిక (ఎంఈఆర్) తెలిపింది.
మన ఆర్ధిక వ్యవస్థ బేష్
మిగతా ప్రపంచ దేశాలతో పోల్చితే 2022-23 ఆర్థిక సంవత్సరం సగం వరకు ఆర్ధిక వృద్ధి, స్థిరత్వం విషయంలో మన దేశం మెరుగ్గానే ఉందని పేర్కొంది. 2022 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో పీఎంఐ కంపోజిట్ ఇండెక్స్ ప్రకారం మన దేశ ఆర్ధిక కార్యకలాపాలు 56.7 శాతం ఉంటే, మిగతా ప్రపంచ దేశాల ఇండెక్స్ 51.0గా ఉందని తెలిపింది. ఆరు నెలలకు ఇండియా ద్రవ్యోల్బణం సగటున 7.2 శాతం ఉంటే, మిగతా ప్రపంచ దేశాల సగటు ద్రవ్యోల్బణం 8.0 శాతంగా ఉందని ఎంఈఆర్ నివేదిక తెలిపింది. ఇది ప్రధాన ఆర్ధిక వ్యవస్థల్లో ఉన్న ద్రవ్యోల్బణాన్ని సూచిస్తుందని తెలిపింది.
మన రూపాయి బెటర్
2022-23 ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల డాలర్‌తో రూపాయి మారకం విలువ 5.4 శాతం తగ్గిందని ఎంఈఆర్ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో డిఎక్స్‌వై ఇండెక్స్‌లో ఉన్న ఆరు ప్రధాన దేశాల కరెన్సీ విలువ 8.9 శాతం పతనమైందని పేర్కొంది. పెరుగుతున్న ఆదాయాలు వల్ల ఆగస్టు వరకు ద్రవ్యలోటు పెరగకుండా బడ్జెట్ స్థాయికి అనుగుణంగా ఉండేందుకు ఉపయోగపడిందని తెలిపింది. లేకుంటే మూలధన వ్యవయం, అధిక ఎరువులు, ఆహార సబ్సిడీ లు, ఎక్సైజ్ పన్నుల్లో కోత వంటి అంశాలతో ఇది మరింత ద్రవ్యోల్బణానికి దారితీసేందని పేర్కొంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో కాంట్రాక్ట్ ఆధారిత సర్వీస్ సెక్టర్ చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధికి తోడ్పడిందని నివేదిక తెలిపింది. టూరిజం ఇండస్ట్రీ కూడా ఈ కాలంలో మంచి పురోగతిని సాధించిందని తెలిపింది. రిటైల్, పరిశ్రమ, సేవల రంగాలకు బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ రుణాలను అందించడంతో బలమైన వృద్ధికి తోడ్పడిందని పేర్కొంది.
ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు చక్కబడిన తరువాత చాలా కాలంగా ఎదురు చూస్తున్న దేశీయ ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్ దారిలోపడుతుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. చాలా సంవత్సరాల అభివృద్ధి తరువాత మన దేశ కార్పోరేట్లు, బ్యాంక్‌ల బ్యాలన్సె షీట్లు మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. మన దేశ పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా వ్యాపారులు, గృహస్తులు కూడా ఉపయోగించుకునేందుకు వీలుగా అతి పెద్దగా అవతరించిందని తెలిపింది.
ఇంధన ధరలపై ఆందోళన
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దీని ప్రభావం ఇంధన ధరలపైనా, సరఫరా వ్యవస్థలపై పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే పరిస్థితి ఉంటే మాత్రం 2023లో ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.