హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వారంరోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం కూరగాయలపై పడింది. ఎడతెరిపి లేని వర్షాలతో కూరగాయ పంటపోలాలు నీట మునిగిపోవడం, ఉన్న వాటిని కూడా హైదరాబాద్‌కు చేర్చలేని పరిస్థితుల్లో నగరంలోని ప్రధాన మార్కెట్లతో పాటు రైతుబజార్లు కూడా ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. టమాట ధర కొండెక్కి కూర్చుంది. ఆగస్టు మొదటి వారంలో కిలోకు రూ. 10 ఉన్న టమాట నెలరోజుల్లోనే రూ. 50 దాటింది. బీరకాయ, చిక్కుడు, వంకాయ, బెండ, కాకర, క్యారేట్ తదితర అన్ని కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఏ కూరగాయలైనా కనీస ధర కిలోకు రూ. 60 నుంచి రూ. 80 పలుకుతున్నాయి..
బోయనపల్లి మార్కెట్లో సాధారణ రోజుల్లో 30వేల నుంచి 40వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్, ఎన్టీఆర్ మార్కెట్లో 10వేల క్వింటాళ్ల కూరగాయలు సరఫరా అయ్యేవి. గత వారం రోజులుగా 30నుంచి 40శాతం కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇక నగరంలోని 11ప్రధాన రైతుబజార్లలో సైతం అంతంత మాత్రంగానే కూరగాయలు రవాణా అవుతున్నాయి. వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ సిటీకి తగ్గిన రవాణా…
కోటి మందికి పైగా ఉన్న హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు దాదాపు 300 మైట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం ఉంటుంది. నగరప్రజల అవసరాలకు సరిపడా దిగుమతి లేకపోవడంతో నగరంలో ఉన్న మూడు హోల్‌సెల్ మార్కెట్లైన గుడిమల్కాపూర్, బోయినపల్లి, ఎన్టీఆర్ మార్కెట్లు కూరగాయలు లేక వెలవెలపోతున్నాయి రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి తదితర చుట్టు పక్క జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి దిగుమతి అవుతాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు నగరానికి రావాణా అయ్యే రాష్ట్రాల్లో కూడా వర్షాల ప్రభావంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాంతో నగరానికి రవాణా సగానికి సగంతగ్గిందని, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కూరగాయల ధరలు
టామాట రూ.50 నుంచి రూ.60
బెండకాయ రూ.50 నుంచి రూ.60
కాకర రూ.70 నుంచి రూ.80
చిక్కుడు రూ.70 నుంచి రూ.80
క్యారేట్ రూ.70 నుంచి రూ.80
క్యాప్సికమ్ రూ.70 నుంచి రూ.80
బీరకాయ రూ.70 నుంచి రూ.80
దొండకాయ రూ.70 నుంచి రూ.80