టెస్లా ఇండియాకు రావడం ఖాయమైంది. అమెరికా పర్యటనలో ప్రధాన మంత్రితో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సమావేశమైన తరువాత ఈ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఇండియాలో ప్లాంట్ పెట్టాలని మస్క్ నిర్ణయించారు. సంవత్సరానికి 5 లక్షల ఈవీ కార్ల తయారీ సామర్ధ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇండియాలో 20 లక్షల ప్రారంభ ధరతో ఈవీ కార్లను విక్రయించాలని కంపెనీ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు టెస్లా ప్రతినిధులతో ప్లాంట్ ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నారు. చైనా తరువాత కంపెనీ ఇండియాలోనే ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇండియా నుంచి ఇండోపసిఫిక్ దేశాల మార్కెట్లకు టెస్లా కార్లను ఎగుమతి చేయనున్నారు. ఇండియాలో ప్లాంట్ ఏర్పాటుపై టెస్లా ప్రతినిధులు మంచి ప్రణాళికతో తమను సంప్రదించారని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దేశీయంగానే వీటిని తయారు చేయడంతో పాటు, ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా చేస్తామని కంపెనీ ప్రతిపాదించినట్లు తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు మే నెలలో టెస్లా కంపెనీ ప్రతినిధులు ఇండియాలో పర్యటించారు. టెస్లా ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేయడం గురించి వారు చర్చలు జరిపారు. ప్రధాన పర్యటనలో ఎలాన్ మస్క్ ఆయనతో సమావేశమైన తరువాత ప్లాంట్ ఏర్పాటుపై మస్క్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కేంద్రంతో టెస్లా ప్రతినిధులు తమ ప్రతిపాదనలపై చర్చలు జరిపారు. టెస్లా చాలా కాలంగా మన దేశ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చైనా నుంచి మన దేశానికి కార్లను దిగుమతి చేసుకుని విక్రయించాలని ప్రాతిపాదించింది.
ఇందు కోసం దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరింది. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించలేదు. దిగుమతి సుంకాలు తగ్గించలేమని, టెస్లా ఇక్కడే ప్లాంట్ పెట్టి కార్లను తయారు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అప్పటి నుంచి టెస్లా తన ప్రయత్నాలు చేస్తోంది. మన దేశ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో గత సంవత్సరం 3.9 మిలియన్ కార్ల అమ్మకాలు జరిగాయి. చైనా, అమెరికా, జపాన్ తరువాత మన దేశ మార్కెట్ అతి పెద్దదిగా ఉంది. దీంతో టెస్లా ఇక్కడే తయారీ ప్లాంట్ పెట్టాలని ఎట్టకేలకు నిర్ణయించింది.
20 లక్షలకే కారు…
ప్రస్తుతం మన దేశంలో ఈవీ కార్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. టెస్లా ఇండియా ప్లాంట్‌లో తయారు చేసే కార్ల ప్రారంభ ధర 20 లక్షలు ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇది మన దేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై భారీ ప్రభావాన్ని చూపించనుంది. లగ్జరీ సెగ్మెంట్‌లో ఈవీ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం టాటా కంపెనీ అందిస్తున్న ఈవీ కార్ల ధరలు 20 లక్షల లోపుగా ఉన్నాయి. మిగిలిన కంపెనీల కార్లు 25 లక్షలకు పైగా ధరలో లభిస్తున్నాయి. 2020 లో పెట్రోల్ కార్ల కంటే సరాసరి 137 శాతం ఈవీ కార్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈవీ, పెట్రోల్ కార్ల మధ్య ధరల్లో తేడా 73 శాతం ఉందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. టెస్లా కార్ల ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది. దీనికి ఎంత పెట్టుబడి పెడుతుందన్న అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది