చైనాలో విక్రయించిన కార్లను టెస్లా భారీ ఎత్తున రీకాల్ చేసింది. స్టీరింగ్ ఆటోమేటిక్ అసిస్టెంట్, డోర్ లాకింగ్ వ్యవస్థ పనితీరులో లోపాలు తలెత్తిన కారనంగా ఈ నిర్ణయం తీసుకుంది. కార్ల రీకాల్‌పై చైనాలోని మార్కెట్ నియంత్రణ సంస్థ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. బీజింగ్, షాంఘైలో విక్రయించిన 16 లక్షల టెస్లా కార్లలో తలెత్తిన లోపాలను రిమోట్ అప్‌గ్రేడ్ సాయంతో సంస్థనే సరి చేస్తుందని తెలిపింది. కార్ల యజమానులు సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరంలేదని పేర్కొంది.
ఈ సమస్యను మొత్తం నాలుగు రకాల కార్లలో గుర్తించారు. ఆగస్టు 26, 2014 నుంచి డిసెంబర్ 20, 2023 వరకు విక్రయించిన మోడల్ ఎస్, మోడల్ ఎక్స్‌లో 7,538 కార్లలో డోర్ లాక్ లాజిక్ కంట్రోల్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, కారు ప్రమాదానికి గురైన సమయంలో డోర్ తె రుచుకోవడంలో సమస్య తలెత్తినట్లు గుర్తించారు. మిగిలిన వాటిలో స్టీరింగ్ ఆటోమేటిక్ అసిస్టెంట్ వ్యవస్థలో తలెత్తే సమస్య కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. గత రెండు నెలల వ్యవధిలో అమెరికాలో2 లక్షల కార్లను టెస్లా రీకాల్ చేసి డ్రైవర్ మానిటరింగ్ వ్యవస్థలోని లోపాలను సరిచేసింది.
ఆగ్ర స్థానంలో బీవైడీ…
విద్యుత్ కార్ల అమ్మకాల్లో ప్రపంచ అగ్రగామి కంపెనీగా ఉన్న టెస్లా తన స్థానాన్ని కోల్పోయింది. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తాజాగా అమ్మకాల్లో టెస్లాను అధిగమించి ప్రపంచ నెంబర్ వన్ విద్యుత్ కార్ల కంపెనీగా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధ్వర్యంలోని టెస్లా నాలుగో త్రైమాసికంలో 4,84,507 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు త్రైమాసికంతో పోల్చితే 11 శాతం ఎక్కువ అమ్మకాలు నమోదయ్యాయి. అయినప్పటికీ చైనా దిగ్గజ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ బీవైడీతో పోటీలో వెనుకబడింది.
4వ త్రైమాసికంలో బీవైడీ కంపెనీ మొత్తం 5,26,409 యూనిట్లను విక్రయించింది. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నందున కొత్త సంవత్సరంలో కూడా టెస్లాను బీవైడీ అధిగమిస్తుందని భావిస్తున్నారు. వీటితో పాటు బీవైడీ నాలుగో త్రైమాసికంలో 4 లక్షల ప్లగ్ ఇన్ హైబ్రీడ్ కార్లను విక్రయించింది. 2023లో మొత్తం 30 లక్షల కార్లను బీవైడీ విక్రయించింది. 2023లో డిసెంబర్ నాటికి పూర్తి విద్యుత్ కార్ల అమ్మకాల్లో టెస్లానే ముందుంది. డిసెంబర్ నాటికి టెస్లా మొత్తం 18 లక్షల కార్లను విక్రయిస్తే, బీవైడీ 16 లక్షల కార్లను విక్రయించింది.