న్యూఢిల్లి : ఎల్ఐసీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ముగిసింది. రేపు (గురువారం) డీమ్యాట్ అకౌంట్స్‌లో షేర్ల కేటాయింపు జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో షేర్ల కేటాయింపు జరగనివారికి మే 13న డబ్బులు ఖాతాలో జమ అవుతాయి. ఏఎస్బీఏ ఖాతా ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి నిధులు కూడా అదే రోజు అన్ బ్లాక్ అవుతాయి. అనంతరం షేర్లు మే 16న డీమ్యాట్ ఖాతాలకు బదలీ అవుతాయి. 16.20 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూకు కేటాయించగా.. 47.83 కోట్ల బిడ్లు దాఖలైనట్టు తెలుస్తుంది. అత్యధికంగా పాలసీ హోల్డర్ల కేటగిరీలో 6.11 రెట్ల బిడ్లు దాఖలు అవ్వగా.. కనిష్టంగా రిటైల్ కోటాలో 1.99 రెట్ల దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగుల కోటాలో 4.40 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. అయితే ఎల్ఐసీ షేరు ఏ ధరకు లిస్ట్ అవుతుందో అన్న చర్చ తీవ్రంగా జరుగుతున్నది. ఎల్ఐసీ ఐపీఓ పెట్టుబడిదారులు లిస్టింగ్ లాభాలను పొందొచ్చని నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో అస్థిరత కారణంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన కొనసాగుతున్నది. ఈ ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్దగా పాల్గొనకపోవడంతో.. గ్రే మార్కెట్ ప్రీమియం ప్రతికూలంగా మారే అవకాశం ఉందంటున్నారు ఆర్థికరంగ నిపుణులు. జాబితా ఇష్యూ ధర కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసీ ఇష్యూ మే 9న ముగిసింది. ఇష్యూ 3 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది. అయితే ఇష్యూలో విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం మిశ్రమంగా ఉంది. ఎల్ఐసీ స్టాక్ మే 17న లిస్ట్ అవ్వనుంది.
బలహీనమైన మార్కెట్ కారణం..
కొన్ని కీలక ఆర్థిక రంగ నిపుణుల అంచనా ప్రకారం.. ఎల్ఐసీ స్టాక్ ఇష్యూ ధర కంటే రూ.15 దిగువన లిస్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఎల్ఐసీకి జీఎంపీలో స్థిరమైన క్షీణత ఉందని చెప్పుకొచ్చారు. బలహీనమైన మార్కెట్ పరిస్థితులు అలాగే ఇష్యూపై విదేశీ పెట్టుబడిదారుల అనాసక్తి.. కారణంగా జీఎంపీలో పతనం కనిపించింది. గ్రే మార్కెట్ అనేది.. అనధికారిక మార్కెట్. ఇక్కడ మార్కెట్లోని పార్టీలు ట్రేడ్లు లేదా సెక్యూరిటీలలో నిమగ్నమై ఉంటాయి. ఇందులో డీల్‌లు అధికారికంగా ప్రారంభం కాలేదు. ఇది ఓవర్ ది కౌంటర్ మార్కెట్. ఇందులో సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్ లేదా మరేదైనా రెగ్యులేటర్ ప్రమేయం ఉండదు. గ్రే మార్కెట్ ప్రీమియం అనేది.. ఈ డీల్‌లలో పాల్గొన్న వ్యాపారులు సెక్యూరిటీ లేదా స్టాక్‌పై అంచనా వేసిన ప్రీమియం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి