గుజరాత్ సర్కిల్‌లో ఇంటర్నెట్ సేవలు, క్యాప్టీవ్ నెట్‌వర్క్ నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ టెలికమ్యూనికేషన్స్ శాఖ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) పొందింది. జూన్ 28న టెలికం శాఖ ఈ లెటర్‌ను జారీ చేసింది. గుజరాత్ సర్కిల్‌లో అదానీ గ్రూప్ సుదూర ప్రాంతాల కాల్స్, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ లైసెన్స్ ఉపయోగపడుతుంది. ఇలాంటి సేవలే ఇతర ప్రాంతాల్లోనూ అందించేందుకు మరిన్ని లెసెన్స్‌లు తీసుకోవాల్సి ఉందని కంపెనీ తెలిపింది. తాము కేవలం క్యాప్టీవ్ ప్రయివేట్ నెట్‌వర్క్ ఏర్పాటుకే పరిమితం అవుతామని, వినియోగదారుల టెలికం సేవల్లోకి ప్రవేశించడంలేదని కంపెనీ స్పష్టం చేసింది.
ఆదానీ గ్రూప్ టెలికం రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుని 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. వేలంలో పాల్గొనే వారి తుది వివరాలను టెలికం శాఖ ఈ నెల 20న వెల్లడించనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన అదానీ డేటా నెట్‌వర్క్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో ఈ వేలంలో పాల్గొననుంది. కొత్త కంపెనీ నికర విలువను 248.35 కోట్లుగా చూపించారు. ఈ కంపెనీకి ప్రమోటర్ కంపెనీగా ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ 4730.66 కోట్లు మూలధనంగా చూపించింది.
అదానీ గ్రూప్ ఇప్పటికే నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, గనులు, సిమెంట్, కాపర్, హైడ్రోజన్ గ్యాస్ ఇలా పలు రంగాల్లోకి ప్రవేశించింఇ. ఇదే కోవలో త్వరలోనే అదానీ టెలికం రంగంలోనూ ప్రవేశిస్తారని మార్కెట్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. ప్రస్తుతానికి వినియోగదారుల సేవల్లోకి ప్రవేశించడంలేదని చెప్పినప్పటికీ, ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా ప్రవేశించే అవకాశం ఉందని ఈ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సిమెంట్ రంగంలో ఇలానే ప్రవేవించిన అదానీ ప్రస్తుతం రెండో అతి పెద్ద ఉత్పత్తిదారుగా మారారు. ఈ రంగంలో ఇప్పటికే ఉన్న కంపెనీలను కొనుగోలు చేయడం, మోజార్టీ వాటాను దక్కించుకోవడం ద్వారా అదానీ ఈ రంగంలో ప్రవేశించే అవకాశం ఉందని ఈ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తీవ్ర నస్టాల్లో ఉన్న వోడాఫోన్ ఐడియా ను కొనుగోలు చేయాలంటే 2.5 లక్షల కోట్ల మూలధన పెట్టుబడి కావాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్‌లో అదానీ టెలికం సేవల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన గోల్డ్‌మెన్ శాక్స్ అంచనా వేసింది.
క్యాప్టివ్ నెట్‌వర్క్ కోసమే 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాలంటే వేలంలో పాల్గొనాల్సిన అవసరంలేదని ఈ సంస్థ స్పష్టం చేసింది. వేలంలో పాల్గొంటే అధికంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని, క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకోవాడానికి నేరుగానే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. భవిష్యత్‌లో వినియోగదారుల సేవల్లోకి ప్రవేశించే ఉద్దేశ్యంతోనే అదానీ గ్రూప్ వేలంలో పాల్గొంటోందని తెలిపింది. ఉన్న బకాయిలను ఈక్విటీగా మార్చడం వల్ల ప్రభుత్వానికి వోడాఫోన్ ఐడియాలో 33 శాతం వాటా లభిస్తోంది. దీన్ని సరైన సమయంలో అమ్మడం ద్వారా బకాయిలు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించి ఉందిని, ఇప్పుడు అదానీ ప్రవేశిస్తే దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని గోల్డ్‌మెన్ శాక్స్ అంచనా వేసింది. అదానీ టెలికం సేవల్లో ప్రవేశిస్తే పోటీ తీవ్రతరం అవుతుందని అంచనా వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.