Friday, November 22, 2024

నోట్ల రద్దువల్లే పన్ను వసూళ్లు పెరిగాయి.. ఆర్బీఐ ఎంపీసీ సభ్యురాలు ఆషిమా గోయల్‌

పెద్ద నోట్ల రద్దు మూలంగానే పన్ను వసూళ్లు పెరుగుతున్నాయని ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యురాలు ఆషిమా గోయల్‌ అభిప్రాయపడ్డారు. దీని వల్ల రానున్న రోజుల్లో ఎక్కువ మందిపై తక్కువ పన్ను అనే ఆదర్శవంతమైన విధానానికి చేరుకుంటామని చె ప్పారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం, నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా 2016 నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది.

నోట్ల రద్దు వల్ల వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నా, దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు ఉంటాయని గోయల్‌ చెప్పారు. ఆర్ధిక వ్యవస్థలో డిజిటలైజేషన్‌ పెరిగిందని, పన్ను ఎగవేతలు తగ్గాయన్నారు. ఇది ఇంకా మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు పన్ను వసూళ్లు 24 శాతం వృద్ధి చెంది 8.98 లక్షల కోట్లకు చేరిన విషయం తెల్సిందే. జీఎస్టీ వసూళ్లు కూడా ఏడు నెలలుగా వరసగా 1.40 లక్షల కోట్లకు పైగానే నమోదువుతున్నాయి. సెప్టెంబర్‌లో వార్షిక ప్రాతిపదికన 26 శాతం పెరిగి 1.47 లక్షల కోట్లు వసూలయ్యాయి.

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) గురించి మాట్లాడుతూ, నగదు వినియోగాన్ని తగ్గించడం కోసమే సీబీడీసీని తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత చెల్లింపు వ్యవస్థకు ఇది అదనం మాత్రమేనని, ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. డిజిటల్‌ రూపాయి, ఇ-రూపీని ప్రయోగాత్మకంగా త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది. డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు, చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు, అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు ఆర్బీఐ డిజిటల్‌ రూపాయి ప్రతిపాదన చేసింది. ఇ-రూపీపై ఆర్బీఐ కాన్సెప్ట్‌ పేపర్‌ను కూడా విడుదల చేసింది.
ఎక్స్ఛెంజ్‌ రేటు తగ్గించడం, గిరాకీ తగ్గేలా చర్యలు తీసుకోవడం ద్వారా వాణిజ్య లోటును అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

- Advertisement -

దీర్ఘకాలంలో వంటనూనెలు, చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని ఆమె సూచించారు. ఎగుమతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎగుమతుల ఖర్చు తగ్గించడం, సమస్యలను పరిష్కరించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించాలని సూచించారు. సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు 26.72 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అదే సమయంలో ఎగుమతులు 3.52 శాతం తగ్గి 32.62 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement