దేశీయ కార్ల విక్రయాలలో టాటా పంచ్ సత్తా చాటింది. గత కొంతకాలంగా అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా ఉన్న మారుతీ సుజుకీ వేగనార్‌ను వెనక్కి నెట్టింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో తొలి ఏడు నెలల్లో ఎక్కువ విక్రయాలు నమోదుచేసిన మోడల్‌గా నిలిచింది.
జనవరి నుంచి జులై వరకు నమోదైన అమ్మకాల ఆధారంగా ఆటోమార్కెట్ రీసెర్చి సంస్థ జాటో డైనమిక్స్ ఈమేరకు డేటా విడుదల చేసింది. దీని ప్రకారం, 1.26 లక్షల యూనిట్లతో టాటా పంచ్ ముందు వరుసలో నిలిచింది.
తర్వాత స్థానాల్లో వేగనార్ (1.16 లక్షల యూనిట్లు), హ్యుందాయ్ క్రెటా (1 లక్ష), మారుతీ సుజుకీ బ్రెజ్డా 1.05 లక్షలు, మారుతీకేచెందిన ఎర్టిగా 1.04 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కాగా, జులై ఒక్క నెల డేటాను పరిశీలిస్తే టాటా పంచ్ నాలుగోస్థానానికి పడిపోయింది.
వేగనార్ అమ్మకాల రికార్డు టాటా మోటార్స్ దాటడం వెనుక వివిధ కారణాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మైక్రో ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్ అందుబాటు ధరలో ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఆకర్షణీయ ఆఫర్లు కూడా టాటాకు కలిసొచ్చినట్లు చెబుతున్నారు. టాటా పంచ్ సేల్స్‌లో 47 శాతం ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వేరియంట్లే ఉండటం విశేషం.