మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రికల్ కార్ల అమ్మకాల వాటా 25 శాతం ఉండాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు టాటా మోటార్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. సోమవారం నాడు జరిగిన కంపెనీ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ప్రసంగించిన ఆయన 2023 ఆర్ధిక సంవతస్సరంలో 50 వేల ఎలక్ట్రికల్ కార్ల అమ్మకాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఖ్య లక్ష యూనిట్లకు చేరుకోవడమే కంపెనీ లక్ష్యమన్నారు. 2021లో 5 వేల విద్యుత్ కార్ల అమ్మకాలు జరిగాయని, 2022లో ఈ సంఖ్య 19500 చేరుకుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 50 వేలకు చేరుతుందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో లక్ష ఈవీ కార్ల అమ్మకాలు కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. విద్యుత్ కార్లకు దేశంలో మంచి డిమాండ్ ఉందని, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరికొన్ని కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నామని వివరించారు. 2025 నాటికి మొత్తం 10 విద్యుత్ కార్ల మోడల్స్‌ను టాటా మోటార్స్ తీసుకు రానుందని చెప్పారు.
ఈ సమయానికి కంపెనీ అమ్మతున్న మొత్తం కార్లలో విద్యుత్ కార్ల వాటా 25 శాతం ఉంటుందన్నారు. ప్యాసింజర్ ఎలక్ట్రికల్ కార్ల బిజినెస్‌లో టాటా మోటార్స్ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని చంద్రశేఖరన్ వివరించారు. కంపెనీ ఇప్పటికే 3500 కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించింది. ప్రస్తుతం టాటా మోటార్స్ అన్ని విభాగాలు, మోడల్స్ కలిపి నెలవారి 45 వేల యూనిట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇది 50 వేల యూనిట్లకు చేరుకోనుందని ఆయన తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు కంపెనీ ఫోర్డ్ మోటార్స్‌కు చెందిన కార్ల తయారీ ఫ్యాక్టరీని కొనుగోలు చేసినట్లు చెప్పారు. టాటా మోటార్స్ టూ వీలర్ ఎలక్ట్రికల్ వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించడంలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అన్ని రకాల వాహనాలకు అవసరమైన బ్యాటరీలను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.