విద్యుత్ కార్లపై టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. నెక్సాన్, టియాగో, టిగోర్ మోడల్స్‌పై కంపెనీ 1.2 లక్షల రూపాయల వరకు తగ్గింపు ప్రకటించింది. బ్యాటరీ వ్యయం తగ్గడంతో డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. నెక్సాన్ ఈవీపై గరిష్టంగా 1.2 లక్షల రూపాయల తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో తగ్గింపుతో ఈ కారు 14.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టియాగో ఈవీ 70 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఇకపై ఈ మోడల్ ధర 7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ పేర్కొంది. పంచ్ ఈవీ ధరను మాత్రం కంపెనీ తగ్గించలేదు.
విద్యుత్ కార్ల ధరలో ప్రధానంగా బ్యాటరీ ఖర్చు ఎక్కువగా ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది. ఇటీవల కాలంలో బ్యాటరీ సెల్స్ ధరలు తగ్గుముఖం పట్టాయి. భవిష్యత్‌లోనూ వీటి ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించామని టాటా మోటార్స్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాస్తవ చెప్పారు. ఈవీ కార్లను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
దేశీయంగా విద్యుత్ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని టాటా మోటార్స్ పేర్కొంది. 2023లో ప్రయాణ వాహనాల విక్రయాల్లో 8 శాతం వృద్ధి నమోదు అయ్యాయి. ఈవీ సెగ్మెంట్‌లో 90 శాతం వృద్ధి నమోదైంది. 2024 జనవరిలో ఈవీ విక్రయాల్లో 100 శాతం విక్రయాలు పెరిగాయి. ప్రస్తుతం ఈవీ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ 70 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది.