హైదరాబాద్ : నూతన తరపు డిజిటల్ బ్యాంకుల్లో ఒకటైన సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎఫ్ బీ), జూన్ త్రైమాసికంలో నికర లాభం 47శాతం పెరిగి రూ.70 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇదే కాలానికి గత సంవత్సర నికర లాభం రూ.48 కోట్లుగా వుంది. క్రితం ఏడాది నికర వడ్డీ ఆదాయం రూ. 225 కోట్లతో పోలిస్తే ఈ సంవత్సర మొదటి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 31శాతం పెరిగి రూ. 293 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో దీని నిర్వహణ లాభం రూ.117 కోట్లతో పోలిస్తే 23శాతం పెరిగి రూ.144 కోట్లకు చేరుకుంది.
ఈసందర్భంగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎండి అండ్ సీఈఓ భాస్కర్ బాబు మాట్లాడుతూ… ఎఫ్ వై 25 మొదటి త్రైమాసికంలో బ్యాంక్ స్థిరమైన పనితీరును కనబరిచిందన్నారు. ఈ పనితీరు ఎఫ్ వై25 కోసం బ్యాంక్ అందించిన మార్గదర్శకానికి అనుగుణంగా ఉందన్నారు. వికాస్ లోన్ మంచి వేగంతో వృద్ధి చెందుతూనే ఉందన్నారు. వీల్స్ అండ్ హోమ్ లోన్ సెగ్మెంట్లలో గణనీయమైన మద్దతు లభించిందన్నారు. తాము ముందుకు సాగుతున్న వేళ కొత్త అవకాశాలను అన్వేషించగల తమ సామర్థ్యంపై తమకు నమ్మకం ఉందన్నారు.