దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర బడ్జెట్‌లో పలు రాయితీలు కల్పించే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2023-24 బడ్జెట్‌లో దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు వీటిని కల్పించాలని భావిస్తున్నట్లు ఈ రంగానికి చెందిన వారు వెల్లడించారు. ఈవీలతో పాటు, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌కు కూడా ఈ రాయితీలు కల్పించనున్నారు. విద్యుత్ వాహనాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రోత్సహకాలు అవసరమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. లిథియం ఐయాన్ బ్యాటరీల్లో ఉపయోగించే వివిధ విడిభాగాలపై ప్రస్తుతం ఉన్న 20 శాతం దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఈవీ వాహన రంగంపై చర్చించిన సమయంలో దీనిపై అనేక సూచనలు వచ్చాయని ఆర్ధిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. మన దేశంలో తయారీని ప్రోత్సహించడం, బ్యాటరీలు, ఇతర విడిభాగాల రేట్లను తగ్గించేందుకు వీలుగా పన్నుల్లో కొంత రాయితీ ఇవ్వాలని, మరికొన్నింటిని పూర్తిగా తొలగించాలన్న చర్చ జరిగిందని తెలిపారు.
దీనిపై బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉంటాయన్నారు. దేశంలో విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు సింథటిక్ విడిభాగాలపై ఉన్న పన్నులు, బ్యాటరీల్లో వాడే వాటిపై పన్నులు తగ్గింపు అంశంపై నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. 2022-23 ఆర్ధిక సంవ త్సరం ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో మన దేశం 1.32 బిలియన్ డాలర్ల విలువైన లిథియం ఐయాన్ బ్యాటరీలను కొనుగోలు చేసింది. 2021-22 సంవత్సరంలో 1.83 బిలియన్ డాలర్ల విలువైన బ్యాటరీలకు మన దేశం కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ వాహనాలతో పాటు, ఆటో మొబైల్స్, ఆటో పార్టుల ఉత్పత్తిపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకం(పీఎల్‌ఐ) స్కీమ్‌కు 25,938 కోట్లు కేటాయించింది. దీనికి అధనంగా దేశీయంగానే కెమిస్ట్రీ సెల్స్, బ్యాటరీల తయారీను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో 18,100 కోట్ల మేర పీఎల్‌ఐ ఇచ్చేందుకు నిధులు
కటాయించింది.
బ్యాటరీ ధరలు తగ్గించేందుకు కూడా ఇది దోహదపడనుంది. విద్యుత్ వాహనాల నిర్వాహణ తక్కువగా ఉన్నప్పటికీ, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీలకు రోడ్డు ట్యాక్స్‌ను రద్దు చేశాయి. దీని వల్ల ఈవీల కొనుగోలు ధరలు తగ్గుతాయి. వీటితో పాటు ప్రభుత్వం 10 వేల కోట్లతో ఫాస్టర్ ఎడాప్షన్ ఆఫ్ మాన్యూఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్‌ఏఎంఈ- ఫ్రేమ్) సబ్సిడీని అందిస్తోంది. దేశంలో విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు ఫ్రేమ్ సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలుచేసేందుకు దీన్ని అమలు చేస్తున్నారు. విద్యుత్ వాహనాలపై ప్రభుత్వం జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. విద్యుత్ వాహనాల ఛార్జర్లు, ఛార్జింగ్ స్టేషన్లపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. విద్యుత్ వాహనాల ఉత్పత్తి, వినియోగం మరింత పెంచేందుకు ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో మరిన్ని ప్రోత్సహకాలు ఇవ్వనుంది.