Sunday, November 24, 2024

Australia లో చదువులు మరింత భారం…

ఆస్ట్రేలియాకు ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్ధుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కోఐసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్ధుల కనీస బ్యాంక్‌ బాలెన్స్‌ మొత్తాన్ని 3,430 డాలర్ల నుంచి 29,710 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది మన కరెన్సీలో 16,35,000 రూపాయలకు సమానం. ఈ నిబంధన మే 10 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

గడిచిన ఏడు నెలల్లోనే విద్యార్ధుల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను పెంచడం ఇది రెండోసారి. ఈ నిర్ణయం మూలంగా భారత విద్యార్ధులపై భారం పడనుంది. దేశంలోకి వలసను నిరోధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల్లో ఇది ఒకటి. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్ధులు అక్కడ సంవత్సర కాలం పాటు నివాసం ఉండేందుకు అవసరమైన ఖర్చుల మొత్తాన్ని బ్యాంక్‌ బ్యాలెన్స్‌గా చూపించాల్సి ఉంటుంది.

- Advertisement -

వీసా డిపాజిట్‌ కనీస పరిమితి 21,041 ఆస్ట్రేలియా డాలర్లుగా ఉండేది. గత సంవత్సరం అక్టోబర్‌లో ఈ పరిమితిని 24,505 ఆస్ట్రేలియా డాలర్లకు పెంచారు. తాజాగా దీన్ని 29,710 ఆస్ట్రేలియా డాలర్లకు పెంచారు. ఇది 19,576 అమెరికన్‌ డాలర్లతో సమానం. కోవిడ్‌ తరువాత ఆస్ట్రేలియాకు వలసలు ఎక్కువయ్యాయి. ఫలితంగా అద్దె ఖర్చులు భారీగా పెరిగాయి. పెరుగుతున్న విద్యార్ధుల వలసలు, మోసపూరిత దరఖాస్తులను నిరోధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఈ చర్యల్లో భాగంగా విద్యార్ధి వీసాలపై కఠిన నిబంధనలు విధిస్తోంది. విద్యార్ధులను ఎంపిక చేసుకోవడంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం శాఖ హెచ్చరించింది. ప్రధానంగా భారత్‌, చైనా, ఫిలిప్పీన్స్‌ దేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్ధులు ఆస్ట్రేలియాకు వెళ్తుతున్నారు. 2023 జనవరి- సెప్టెంబర్‌ నాటికి మన దేశం నుంచి 1.2 లక్షల మంది విద్యార్ధులు ఆస్ట్రేలియాలో ఉన్నత చదువుల కోసం వెళ్లారు.

ఆస్ట్రేలియా వార్షిక ఇమ్రిగ్రేషన్‌ వీసాల సంఖ్యను సగానికి తగ్గించింది. దీని ప్రభావం ప్రధానంగా భారత్‌ విద్యార్ధులపైనే ఎక్కవగా ఉందనుంది. 2022 డిసెంబర్‌ నుంచి 2023 డిసెంబర్‌ కాలంలో భారత్‌ విద్యార్ధుల విసాల మంజూరీ 48 శాతం తగ్గింది. ఆస్ట్రేలియాలో ఎన్‌రోల్‌ అవుతున్న విదేశీ విద్యార్ధుల్లో భారత్‌ రెండోస్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement