మన విద్యార్ధుల ఆలోచనా ధోరణి మారుతోంది. చాలా మంది విద్యార్ధులకు అమెరికా వెళ్లాలన్నది కలగా ఉంటుంది. అందుకే అత్యధికంగా అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు. క్రమంగా వారి ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది. ఇప్పుడు యూనైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కూడా విద్యార్ధుల ఎంపికలో ఉంటోంది. ఈ సంవత్సరం జూన్ నాటికి మన దేశంలో నుంచి విద్యార్ధి వీసాలు, టూరిస్టు వీసాలు, వర్క్ పర్మిట్ వీసాలు అత్యధికంగా జారీ చేసినట్లు యూకే ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. 2022, జూన్ నాటికి మన దేశానికి చెందిన 1,18,000 మంది విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం విద్యార్ధి వీసాతో యూకేకు వెళ్లారు. ఇది గత సంవత్సరంతో పోల్చితే 89 శాతం అధికం. ఈ విషయంలో సంఖ్య పరంగా చైనాను మన దేశ విద్యార్ధులు అధిగమించారు. బ్రిటన్‌లో విదేశీ విద్యార్ధుల సంఖ్యలో చైనా అగ్రస్థానంలో ఉంది. తాజాగా మన దేశ విద్యార్ధులు సంఖ్యాపరంగా చైనాను అధిగమించారు. మన దేశానికి చెందిన వారు ఈ సంవత్సరం 1,03,000 వర్క్ వీసాలను పొందారు. వీరిలో నైపుణ్యం ఉన్న వారు, సీజనల్ గా వెళ్లేవారు ఉన్నారని బ్రిటీష్ హై కమిషన్ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే ఇది 148 శాతం అధికం. ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్ జారీ చేసిన స్కీల్డ్ వర్కర్ల వీసాలో మన దేశమే 46 శాతంతో అగ్రస్థానంలో ఉంది.
భారత్ నుంచి బ్రిటన్‌కు వచ్చే వారిలో విద్యార్ధి వీసాల్లోనూ, టూరిస్ట్ వీసాలు, నైపుణ్యం కలిగిన వారికి జారీ చేసే వర్క్ వీసాలు పొందడంలోనూ ముందున్నారని మన దేశంలో ఉన్న బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ హెలీ చెప్పారు. బ్రిటన్ వీసాల జారీలో జరుగుతున్న జాప్యంపై ఆయన కొద్ది రోజుల క్రితమే క్షమాపణలు కోరారు. విద్యార్ధి వీసాలు, వర్క్ వీసాల జారీలో ప్రయారీటీ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీని వల్ల వెంటనే వెళ్లాలని అనుకునే వారికి సాధ్యమైనంత త్వరగా వీసా జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మన విద్యార్ధులు బ్రిటన్ వెళ్లేందుకు ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ఐదు సంవత్సరాల స్డడీ ప్లస్ వర్స్ వీసా కలిపి ఇవ్వడమే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.