Monday, November 18, 2024

Stock Market – బ్లాక్ మండే… ఒక్కరోజులు రూ.7.50 లక్ష‌ల కోట్లు ఆవిరి..

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు సూచీలను పడేశాయి. ఇరాన్‌ జరిపిన దాడులకు ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు తెగబడొచ్చన్న అంచనాలు మదుపరులను కలవరపెట్టాయి. దీంతో మన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 845 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ 240 పాయింట్లకుపైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. స్టాక్‌ మార్కెట్ల పతనంతో రూ.7.5లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది.

సెన్సెక్స్‌ ఉదయం 73,315.16 పాయింట్ల వద్ద దాదాపు 900 పాయింట్ల భారీ నష్టంతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,905 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకినప్పటికీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. చివరికి 845.12 పాయింట్ల నష్టంతో 73,399.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 246.90 పాయింట్ల నష్టంతో 22,272.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.45గా ఉంది. సెన్సెక్స్‌లో మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌ మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌ ప్రధానంగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో 27, నిఫ్టీ-50లో 44 స్టాక్స్‌ నష్టపోవడం గమనార్హం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement