Saturday, November 23, 2024

Follow up : స్టాక్‌ సూచీలు ముందుకే.. నిఫ్టీ తదుపరి లక్ష్యం 18100

అంతర్జాతీయంగా కనిపిస్తున్న సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌మార్కెట్లు మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ 17800 స్థాయిలను దాటిన తర్వాత లాభాల స్వీకరణ కనిపించింది. బ్యాంకింగ్‌ సూచీలోనూ శుక్రవారం 41500 వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపించింది. అయితే, ఆకర్షణీయమైన ఆపిల్‌ ఫలితాలు, బలహీనమైన గృహాల అమ్మకాల గణాంకాల మధ్య అమెరికా మార్కెట్‌ పుంజుకుంది. ఇక నవంబర్‌ 2న జరిగబోయే యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌పై అందరూ దృష్టిసారించనున్నారు. అమెరికా 10 సంవత్సరాల బాండ్ల రాబడులు కూడా 4.33 శాతం నుంచి 4.016 శాతానికి తగ్గుతున్నాయి. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌ పైనా మదుపర్లు దృష్టిసారిస్తారు. క్యూ2 ఫలితాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇది స్టాక్‌ కదలికను పరిమితం చేస్తుంది. ఇక అక్టోబర్‌ ఆటో సేల్స్‌ కూడా కీలకమైనవి. పండగ సీజన్‌ డిమాండ్‌ను ఇవి ప్రతిబింబిస్తాయి.దీనితోపాటు సంస్థాగత ప్రవాహాలు మార్కెట్‌ గమనానికి కీలకం కానున్నాయి.


సాంకేతికంగా ర్యాలీ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే నిఫ్టీ 17800-18100 మధ్య బహుళ నిరోధక స్థాయిలను కలిగివున్నందున మొమెంటం మందగిస్తుంది. దిగువన 17600-17400 బలమైన మద్దతు స్థాయిలు. సెక్టార్‌ పరంగా స్టాక్స్‌ జోరు కొనసాగుతుంది. బ్యాంకు నిఫ్టీ 41500-42000 జోన్‌లో నిరోధాన్నిఎదుర్కొంటుంది. దిగువన 40,300-40000 తదుపరి మద్దతు స్థాయిలు. 42000 మార్కును నిలబెట్టుకుంటే తదుపరి ర్యాలీ 43000 వరకు కొనసాగవచ్చు. ఎఫ్‌ఐఐలు నవంబర్‌ సిరీస్‌లో 57 శాతం ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ లాంగ్‌ పొజిషన్‌లో ఉన్నారు. మొత్తంగా డెరివేటివ్‌ డేటా తటస్థంగా, సానుకూల సంకేతాలను చూపిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement