దివాళా తీసిన ఎయిర్‌లైన్స్ గో ఫస్ట్ కొనుగోలు కోసం బిజీ బీ ఎయిర్‌లైన్స్‌తో కలిసి స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ వ్యక్తిగతంగా బిడ్ దాఖలు చేశారు. కొత్త ఎయిర్‌లైన్‌కు స్టాప్‌ను, సర్వీస్‌లను అందించడం ద్వారా తాము ఆపరేటింగ్ భాగస్వామిగా ఉంటామని స్పైస్‌జెట్ తెలిపింది. గోఫస్ట్ ని కొనుగోలు చేసేందుకు ఆసక్తికి వ్యక్తం చేస్తూ స్పైస్‌జెట్ డిసెంబర్ 19న రెగ్యులేటరీ ఫైలింగ్‌ను దాఖలు చేసింది.
కంపెనీ తన ఆర్ధిక స్థితిని, వృద్ధి ప్రణాళికకు మద్దతునిచ్చేందుకు సుమారు 270 మిలియన్ డాలర్ల తాజా మూలధానాన్ని సేకరించే ప్రక్రియను ప్రారంభించే ప్రణాళికలను కూడా ప్రకటించింది. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేసేందుకు షార్జాకు చెందిన స్కై వన్, ఆఫ్రికా ఫోకస్డ్ సఫ్రిక్ ఇన్వెస్ట్‌మెంట్స్, అమెరికా ఆధారిత ఎన్‌ఎస్ ఏవియేషన్ వంటి ఇతర సంస్థలు కూడా గోఫస్ట్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరిచాయి. అయినప్పటికీ, స్పైస్‌జెట్ ఇతర విమానయాన సంస్థలతో పోలిస్తే ప్రయాణికుల విమానాలను నిర్వహించే అనుభవం ఉన్నందున గట్టి పోటీదారుగా పరిగణిస్తున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో గో ఫస్ట్‌కు రుణాలు ఇచ్చిన బ్యాంక్‌లు గో ఫస్ట్ కొత్త ఇన్వెస్టర్లను తీసుకోవడంలో విఫలం కావడంతో ఎయిర్‌లైన్‌ను లిక్విడేట్ చేయడం ప్రారంభించాలని నిర్ణయించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్, డ్యుయుష్ బ్యాంక్‌తో సహా రుణదాతలకు మొత్తం 6500 కోట్లు బాకీపడింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గో ఫస్ట్ ఇన్‌సాల్వేన్సీ ప్రక్రియను మరో 60 రోజులు పొడిగించింది. గోఫస్ట్ కొనుగోలు పట్ల ఆసక్తిగా ఉన్న మూడు సంస్థలకు రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్‌పీ) ఈ విషయం తెలిపారు.
ఈ నిర్ణయం పట్ల కొంత మంది లీజర్స్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 15 లోగా గోఫస్ట్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న స్పైస్ జెట్ ప్రమోటర్‌తో పాటు మిగిలి వారు కూడా తమ పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించాల్సి ఉంటుంది. గోఫస్ట్ ఇన్‌సాల్వేన్సీ ప్రక్రియ 2023 మే 2న ప్రారంభమైంది. స్పైస్ జెట్ కూడా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భాగస్వాముల మధ్య విభేదాలతో ఆర్ధికంగా సమస్యలు ఎదుర్కొంటున్నది. 2019లో స్పైస్ జెట్ ఉన్నత స్థితిలో ఉండేది. ఆ సమయంలో 118 విమానాలను ఆపరేట్ చేసింది. సంస్థలు 16 వేల మంది సిబ్బంది పని చేసేవారు. 16.3 శాతం దేశీయ మార్కెట్ వాటా కలిగి ఉంది. 51 జాతీయ, అంతర్జాతీయ రూట్లలో ఈ సంస్థ 516 రోజువారి సర్వీస్‌లు నడిపేది.