ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ స్పైస్ జెట్, దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంకు యాక్సిస్ బ్యాంకు కలిసి ఓ సరికొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేశారు. రెండు వేరియంట్స్‌లో ఈ క్రెడిట్ కార్డులు లభ్యం అవుతాయని స్పైస్ జెట్ ప్రకటించింది. రోజువారీగా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులపై రివార్డులు కూడా లభిస్తాయని, అదేవిధంగా విమాన సర్వీసులకు సంబంధించి టికెట్లు కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉంటుందని తెలిపింది. ట్రావెల్‌తో పాటు డిజిటల్ పేమెంట్ ఏకం కావడంతో.. వినియోగదారులకు మంచి బెనిఫిట్స్ పొందుతారని వివరించింది. స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ అండ్ ఎండీ అమితాబ్ చౌదరీలు కలిసి ఈ కార్డును ఆవిష్కరించారు.
బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్‌పై కూడా ఈ క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఫొటోను ముద్రించినట్టు వివరించారు. స్పైస్‌జెట్ యాక్సిస్ బ్యాంక్ వాయేజ్, స్పైస్‌జెట్ యాక్సిస్ బ్యాంక్ వాయేజ్ బ్లాక్ వేరియంట్స్‌లో లభ్యం అవుతాయన్నారు. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ కోసం తరుచూ ఫ్లయర్ ప్రోగ్రామ్‌కు మార్గదర్శిగా ఉందని, యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి ఈ కార్డును తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని అజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. స్పైస్‌జెట్, యాక్సిస్ బ్యాంకు బృందాలు కలిసి మంచి ఆఫర్స్‌ను అందిస్తాయని, మంచి అనుభవాన్ని కల్పిస్తాయనే నమ్మకం ఉందన్నారు.