ఐఫోన్ల అసెంబ్లింగ్ రంగంలోకి ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ అడుగిడేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం గత ఏడాది కాలంగా తైవాన్‌కు చెందిన విస్ట్రన్ కార్ప్ కొనుగోలుకు జరుపుతున్న చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.తైవాన్ సంస్థ విస్ట్రన్ కార్ప్ దేశీయంగా కర్ణాటకలో ఐఫోన్లను తయారు చేస్తోంది. తొలుత జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ, తర్వాత కొనుగోలుకే టాటా కంపెనీ మొగ్గు చూపినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో 600 మిలియన్ డాలర్ల విలువకు విస్ట్రన్ యూనిట్ కొనుగోలు ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఐఫోన్ 14 మోడల్ అసెంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఐఫోన్ల తయారీని పెంచుకుంటూ వచ్చిన విస్ట్రన్ కార్ప్, 2023 మార్చి నాటికి 1.8 బిలియన్ డాలర్లు విలువైన ఐఫోన్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది కల్లా శ్రామిక శక్తిని సైతం మూడింతలు చేయాలని విస్ట్రన్ కార్పొరేషన్ పేర్కొంది.
భారత్ నుంచి విస్ట్రన్ నిష్క్రమణ అనంతరం టాటా గ్రూప్ ఈ హామీలను కొనసాగించనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దేశీయంగా తయారీని ప్రోత్సహంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహ కాలను ఇస్తోంది. దీనికి తోడు చైనా నుంచి ఐఫోన్ల ఉత్పత్తిని కొంతమేరయినా తరలించాలని యాపిల్ సైతం నిర్ణయించింది. ఈ క్రమంలోనే టాటా గ్రూప్ ఐఫోన్ల అసెంబ్లింగ్‌కు ముందుకొచ్చింది. ఇది కార్యరూపం దాలిస్తే ఐఫోన్లను తయారుచేసే తొలి భారత కంపెనీగా టాటా గ్రూప్ నిలవనుంది. ప్రస్తుతం టాటా గ్రూప్ ఉప్పు నుంచి ఐటీ సేవల వరకు వివిధ రంగాల్లో ఉంది. ఐఫోన్ల అసెంబ్లింగ్ ద్వారా కొత్త రంగంలోకి అడుగు పెట్టనుంది.