Tuesday, November 26, 2024

కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి.. వచ్చే ఏడాది అక్టోబర్‌ నుంచి అమలు

రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. కార్ల విషయంలో తాజాగా కీలక ఆదేశాలు జారీచేసింది. వచ్చే ఏడాది అక్టోబర్‌ నుంచి కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలని వాహన పరిశ్రమకు స్పష్టంచేసింది. దీనిపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న గ్లోబల్‌ సప్లయి చైన్‌ అవరోధాలు, మైక్రో ఎకనామిక్స్‌ పరిస్థితుల దృష్ట్యా ప్యాసింజర్‌ కార్లలో (ఎం-1 వేరియంట్‌) కార్లధర, వేరియంట్‌లతో సంబంధం లేకుండా 2023 అక్టోబర్‌ నాటికి ఆరు ఎయిర్‌ బ్యాగులు కచ్చితంగా ఉండాల్సిందేనని చెప్పారు. వాహనాల్లో ప్రయాణించే వారి భద్రతే తమకు ముఖ్యమని చెప్పారు. ఎం-1 వాహన కేటగిరీ అనేది అనేది డ్రైవర్‌ సీటుతోపాటు గరిష్టంగా ఎనిమిది సీట్లతో కూడిన ప్యాసింజర్‌ కార్లను సూచిస్తుంది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, మల్టి యుటిలిటీ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు ఈ కేటగిరి కిందకు వస్తాయి.

వాస్తవానికి ఈ నిబంధనల్ని ఈ ఏడాది నుంచే అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై జనవరి 14న ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే, తుది ఉత్తర్వులు జారీకాలేదు. ఈ నిర్ణయం పట్ల ఆటో పరిశ్రమ అసంతృప్తి వ్యక్తంచేసింది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేయడం వల్ల, ధరలు పెరుగుతాయని, వినియోగదార్లకు భారమవుతుందని మొత్తంగా పరిశ్రమ ఉత్పాదకతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. పైగా, ఎయిర్‌బ్యాగ్‌ల సరఫరా పరిమితుల దృష్య్యా తక్షణ అమలు సాధ్యంకాదని నివేదించింది. దీంతో కేంద్రం కొద్దిమేర సడలింపులు ఇచ్చింది. నిర్దిష్ట గడువును వచ్చే ఏడాదికి పొడిగించింది. అన్నికార్లకు బదులుగా, ఎనిమిది సీట్లున్న కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగుల నిబంధన అమలు చేయాలని కోరింది.
ప్రస్తుతం దేశంలో ఎయిర్‌బ్యాగ్‌లు తయారుచేసే సంస్థలు ఐదు మాత్రమే ఉన్నాయి. అన్ని కార్లలో వీటిని తప్పనిసరి చేస్తే, ఏడాదికి వీటి డిమాండ్‌ 18-20 మిలియన్లకు చేరుతుంది. కాబట్టి కొత్తగా ఎయిర్‌ బ్యాగ్‌ తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు 2021-22లో 30,69,499గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement