Tuesday, November 26, 2024

ఫిక్స్ డ్‌ డిపాజిటర్లకు షాక్‌.. వడ్డీ రేట్లు తగ్గించిన ఐఓబీ, 40 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు వడ్డీ రేట్ల విషయంలో షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా చాలా ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటిస్తున్న తరుణంలో.. ఐఓబీ మాత్రం తమ కస్టమర్లకు షాక్‌ ఇచ్చింది. ఏడాది కంటే తక్కువ వ్యవధితో పాటు రూ.2కోట్ల కంటే తక్కువ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను 40 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించాలని నిర్ణయించింది. ఈ తగ్గించిన వడ్డీ రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లపై బ్యాంకు ఇకపై 3 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేయనుంది. ఈ వడ్డీ రేటు ప్రస్తుతం 3.4 శాతంగా ఉంది. అలాగే 30 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటు 3 శాతంగా నిర్ణయించింది. 121 రోజుల నుంచి 179 రోజుల్లో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై బ్యాంకు 4 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేయనుంది.

మూడేళ్లు పైబడితే.. 5.45 శాతం
270 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది. ఏడాద నుంచి రెండేళ్ల లోపు ఉన్న డిపాజిట్లపై 5.15 శాతం వడ్డీ రేటు ఉంటుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు వ్యవధి గల డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ, మూడేళ్లు, ఆ పైబడిన డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఈ విషయంలో సీనియర్‌ సిటిజన్లకు మాత్రం కొంత వెసులుబాటు ఉంది. ఖాతాదరారు సీనియర్‌ సిటిజన్‌ అయితే.. పైన వెల్లడించిన వడ్డీ రేట్లకు అదనంగా 0.50 శాతం వడ్డీని అందించనుంది. 80 ఏళ్లు పైబడిన సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు మాత్రం 0.75 శాతం వడ్డీని అదనంగా అందించాలని బ్యాంకు నిర్ణయించింది. బ్యాంక్‌ అందిస్తున్న ట్యాక్స్‌ సేవింగ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.45 శాతంగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement