దేశీయ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు, బలహీన త్రైమాసిక ఫలితాల కారణంగా గత ఐదు సెషన్లలో నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం బలంగా పుంజుకున్నాయి.
మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో బుల్ మళ్లీ పరుగులు పెట్టింది. ఫలితంగా సెన్సెక్స్ మళ్లీ 80వేల మైలురాయిని దాటగా.. నిఫ్టీ 24,300 పైన స్థిరపడింది.
ఈ ఉదయం సెన్సెక్స్ 79,653 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు కొనసాగించింది. ఒక దశలో 1100 పాయింట్లకు పైగా లాభపడి 80,539.81 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడటంతో కాస్త ఒత్తిడికి గురైనప్పటికీ రాణించింది.
మొత్తంగా మార్కెట్ ముగిసే సమయానికి 602.75 పాయింట్లు ఎగబాకి 80,005.04 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 24,134 – 24,492 మధ్య కదలాడి చివరకు 158.35 పాయింట్ల లాభంతో 24,339.15 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, విప్రో షేర్లు రాణించాయి. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటార్స్ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సూచీ 3.8శాతం, లోహ సూచీ 2.5శాతం మేర పెరిగాయి.