Saturday, November 23, 2024

Follow up : ష్నైడర్‌ రూ.300 కోట్ల పెట్టుబడి.. శంషాబాద్‌లో ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ పరికరాల తయారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఫ్రెంచ్‌ దిగ్గజం ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ శంకుస్థాపన చేసింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. హైదరాబాద్‌లో రూ.300 కోట్ల పెట్టుబడి పెడుతున్నందుకు కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. స్మార్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కోసం ప్రభుత్వంతో కలిసి శిక్షణనివ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రముఖ ఫ్రెంచ్‌ కంపెనీ ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీని కోరారు. రూ.300 కోట్లతో హైదరాబాద్‌ సమీపంలోని జీఎంఆర్‌ ఇండస్ట్రియల్‌ పార్కు వద్ద ఏర్పాటు కానున్న ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ కొత్త స్మార్ట్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి కేటీఆర్‌ హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ దేశంలోరనే అతిపెద్ద ఫ్యాక్టరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. స్మార్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ స్థానిక యువతకు శిక్షణ ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఒకే రోజు హైదరాబాద్‌లో మూడు ఫ్రెంచ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇది సంతోషించే విషయమని పేర్కొన్నారు. మరిన్ని ఫ్రెంచ్‌ సంస్థలు హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని కేటీఆర్‌ కోరారు. 75 శాతం ష్నీడర్‌ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఏడాదిలోపే సంస్థ తన నూతన ఫ్యాక్టరీ ప్రారంభించనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి…ఫ్రెంచ్‌ బిజినెస్‌ మిషన్‌లో కేటీఆర్‌ ప్రెజెంటేషన్‌

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఫ్రెంచ్‌ పారిశ్రామిక వేత్తలను మంత్రి కేటీఆర్‌ కోరారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఫ్రెంచ్‌ బిజినెస్‌ మిషన్‌ కార్యక్రమంలో రాష్ట్రంలోని పారిశ్రామిక పాలసీ, పెట్టుబడులకు గల అవకాశాలపై ఆయన ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఫ్రాన్స్‌ ఇండియా అంబాసిడర్‌ ఇమాన్యుయేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement