దేశ వ్యాప్తంగా నిత్యావసర, ఇంధన, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పాటు చాలా వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. వీటి కారణంగా ఇప్పటికే ప్రజలు ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం మరింత ఇబ్బందులకు గురి చేయనుంది. రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు తెలిపింది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాలు మరింత ప్రియం కానున్నాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్)ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని కాలపరిమితులపై 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచే సవరించిన రేట్లు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. బ్యాంకుల్లో నిధుల లభ్యత, వాటిని సమీకరించేందుకు అయ్యే ఖర్చులను గణించి.. ఆ తరువాత రుణాలను ఏ వడ్డీ రేటుకు ఇవ్వాలన్నది నిర్ణయించేదే ఎంసీఎల్ఆర్. రుణం కోసం వెళ్లే వారికి ఈ రేటును ప్రామాణికంగా తీసుకుని వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణమే కారణం..
ఎంసీఎల్ఆర్ రేటు పెంపును గమనిస్తే.. ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతానికి చేరుకుంది. నెల ఎంసీఎల్ఆర్ కూడా ఇదే స్థాయిలో 6.65 శాతం నుంచి 6.75 శాతానికి చేరుకుంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ అయితే 6.65 శాతం నుంచి 6.75 శాతానికి చేరుకుంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతం నుంచి 7.05 శాతానికి ఎగబాకింది. ఏడాది ఎంసీఎల్ఆర్ ఇది వరకు 7 శాతం ఉండేది. తాజా నిర్ణయంతో.. ఇప్పుడు ఇది 7.10 శాతానికి చేరింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ కూడా 7.2 శాతం నుంచి 7.3 శాతానికి పెరిగింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ ఇది వరకు 7.30 శాతంగా ఉండేది.. ప్రస్తుతం అది 7.40 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ ఇటీవల మానిటరీ పాలసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించాలని నిర్ణయించింది. కానీ ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఇతరాల వల్ల బ్యాంకులు మాత్రం లోన్ వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. దీంతో కొత్తగా లోన్ తీసుకునేవారికి గతంలో కన్నా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే లోన్ తీసుకుని ఉంటే.. వారిపై ఈఎంఐ భారం పెరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..