ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇంండియా (ఎస్‌బీఐ) అరుదైన ఘనత సాధించింది. బ్యాంక్ చరిత్రలో సరికొత్త మైలురాయిని అందుకుంది. మార్కెట్ విలువ పరంగా 5 లక్షల కోట్లకు చేరుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గాఎస్‌బీఐ అవతరించింది. అన్ని కంపెనీల విలవను పరంగా చూస్తే ఎస్‌బీఐ 7వ స్థానంలో ఉంది. బుధవారం నాడు స్టాక్‌మార్కెట్‌లో బ్యాంక్ షేరు ఒక శాతం పెరగడంతో ఈ మైలురాయిని చేరుకుంది. ఎస్‌బీఐ షేర్లు కొన్ని రోజులుగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. గత సంవత్త’సంవత్సరం బ్యాంక్ షేరు 22 శాతం లాభపడింది. ఈ సంవత్సరం మూడు నెలల్లోనే 26 శాతం లాభపడింది. బ్యాంకింగ్ రంగంలో ఇప్పటి వరకు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నాయి.
రుణాల్లో వృద్ధి పెరుగుతుందని ఇటీవల ఆర్బీఐ వెల్లడించిన వివరాలుతో ఎస్‌బీఐతో పాటు, ఇతర బ్యాంక్‌ల షేర్లు రాణించడానికి ప్రధాన కారణం. దేశీయ బ్యాంక్‌ల రుణాలు 9 సంవత్సరాల గరిష్టానికి చేరాయని ఆర్బీఐ గత నెల వెల్లడించిన డేటా తెలియ చేసింది. అప్పటి నుంచి బ్యాంక్‌ల షేర్లు రాణిస్తున్నాయి. గడిచిన 5 సెషన్లను పరిగణనలోకి తీసుకుంటే ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3 శాతం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 7.5 శాతం చొప్పన లాభపడ్డాయి.
మార్కెట్ విలువ పరంగా చూస్తే మన దేశంలో 17.72 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. 11.82 లక్షల కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో, 8.42 లక్షల కోట్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక ఇన్పోసిస్ 6.5 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 6.34 లక్షల కోట్లతో ఐదవ స్థానంలో, హిందుస్థాన్ యూనిలీవర్ 6.08 లక్షల కోట్లతో ఆరవ స్థానంలో నిలిచాయి. 5.03 లక్షల కోట్లతో ఎస్‌బీఐ 7వ స్థానంలో, 4.52 లక్షల కోట్లతో 8వ స్థానంలో భారతీ ఎయిర్‌టెల్, అదానీ ట్రాన్స్‌మిషన్ 4.5 లక్షల కోట్లతో 9వ స్థానంలో ఉన్నాయి. 4.48 లక్షల కోట్లతో బజాజ్ ఫైనాన్స్ 10వ స్థానంలో నిలిచాయి.