ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ వడ్డీరేట్లను సవరించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది. దీనితో కన్జూమర్, ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. సవరించిన ధరలు ఆగస్టు 15నుంచే అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా ఎంసీఎల్‌ఆర్‌ను సవరించింది. సవరించిన రేటు ప్రకారం, వివిధ రకాల వ్యవధులకు ఎంసీఎల్‌ఆర్ 8.20 శాతం నుంచి గరిష్టంగా 9.1 శాతంగా ఉంది. ఓవర్‌నైట్‌ఎంసీఎల్‌ఆర్ 8.20 శాతానికి చేరగా, నెల, మూడు నెలల కాల వ్యవధులకు లెండింగ్ రేటు 8.45 శాతం నుంచి 8.5 శాతానికి చేరింది.
ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.85 శాతానికి, ఏడాది లెండింగ్ రేటు 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్ 9.05 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్ 9.1 శాతానికి పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్‌లు ఇదివరకే ఎంసీఎల్‌ఆర్‌ను సవరించాయి. ఆగస్టు 8న ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ రెపో రేటును 6.5శాతం వద్ద స్థిరంగా ఉంచుతూ ప్రకటన చేసిన నేపథ్యంలో పై మూడు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి.