Sunday, October 6, 2024

SBI | కొత్తగా 10 వేల ఉద్యోగాల భర్తీ !

దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ ఈ ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఆధునిక టెక్నాలజీ వినియోగం, సాధారణ బ్యాంకింగ్‌ అవసరాల కోసం ఈ ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు తెలిపింది.

ఎస్‌బీఐ టెక్నాలజీపై భారీగా ఖర్చు చేస్తోంది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆధునిక టెక్నాలజీ సాయంలో సేవలు అందించనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. బ్యాంక్‌ ఉద్యోగుల సంఖ్యను మరింత పెంచుకోనుందని, ఇటీవల బ్యాంక్‌ 1,500 మంది టెక్నాలజీ నిపుణులను తీసుకోనున్నట్లు ప్రకటించిందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ సి. శ్రీనివాసు శెట్టి తెలిపారు.

టెక్నాలజీ రిక్రూట్‌మెంట్‌లో డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెస్ట్‌లు, నెట్‌వర్క్‌ ఆపరేటర్లు వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం 8 వేల నుంచి 10 వేల మందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

2024 మార్చి నాటికి బ్యాంక్‌ ఉద్యోగులు 2,32,296 మంది ఉన్నారు. ఉద్యోగుల్లో 1,10,116 మంది అధికారులు ఉన్నారు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ఎస్‌బీఐ కొత్తగా 600 బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎస్‌బీఐకి ప్రస్తుతం 22,542 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఎస్‌బీఐ ఇప్పటి వరకు బ్యాంకింగ్‌ సదుపాయాలు లేని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. పెద్ద పెద్ద రెసిడెన్షియల్‌ కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో బ్యాంక్‌ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు శెట్టి తెలిపారు. ఎస్‌బీఐని ఉత్తమమైన, అత్యంత విలువైన బ్యాంక్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement