దేశంలో విద్యుత్ వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విక్రయాలు ప్రతి ఏటా రెట్టింపు అవుతున్నాయి. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు రెండున్నర రెట్లు పెరిగాయి. 2021-22లో 3,27,900 యూనిట్ల అమ్మకాలు జరిగితే, 2022-23 ఆర్ధిక సంవత్సరంలో వీటి అమ్మకాలు 8,46,976కు పెరిగాయని విద్యుత్ వాహన తయారీదారుల సొసైటీ (ఎస్‌ఎంఈవీ) తెలిపింది. ఈ వివరాలను ఈవీ తయారీ కంపెనీల నుంచి సేకరించినట్లు తెలిపింది.
గంటలకు 25 కి.మీ కంటే తక్కువ వేగం కలిగిన ఇ-స్కూటర్లు 2022-23లో 1.2 లక్షలు అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు సంవత్సరం వీటి అమ్మకాలు 75,457 యూనిట్లుగా ఉన్నాయి. గంటలకు 25 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లే విద్యుత్ టూ వీలర్స్ అమ్మకాలు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 7,26,976 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు సంవత్సరం వీటి విక్రయాలు 2,52,443 యూనిట్లుగా ఉన్నాయని ఎస్‌ఎంఈవీ తెలిపింది. 2022-23లో నీతి ఆయోగ్, ఇతర పరిశోధనా సంస్థలు ఇచ్చిన లక్ష్యం కంటే 25 శాతం అధికంగానే ఈవీల విక్రయాలు జరిగాయని పేర్కొంది.
పీఎంసీ మార్గదర్శకాలను పాటించనందున కొన్ని కంపెనీలకు ఫేమ్-2 డిస్కౌంట్లను ఉపసంహరించుకోవడంతో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందని ఎస్‌ఎంఈవీ అభిప్రాయపడింది. ఈవీల కొనుగోలు విషయంలో వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపింది. ఫేమ్-2 రాయితీల విషయంలో ఉన్న వివాదం పరిష్కారమైతే అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఫేమ్ స్కీమ్‌ను కొనసాగిస్తే రానున్న సంవత్సరాల్లో ఈవీ టూ వీలర్స్ అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్లు తెలిపింది.