అయోధ్య పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణల మేరకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫిర్యాదు నేపథ్యంలో.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది.
సాధారణ మిఠాయిలనే.. అయోధ్య రామ మందిర ప్రసాదంగా ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారని.. మోసపూరిత వాణిజ్య పద్ధతుల్లో అమెజాన్ నిమగ్నమై ఉందని.. తప్పుడు ప్రకటనలతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని అమెజాన్‌పై ఫిర్యాదులో పేర్కొంది సీఏఐటీ. నోటీసుల నేపథ్యంలో అమెజాన్ సంస్థ వారంలోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన వివరణ ఇవ్వలేని నేపథ్యంలో వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది సీసీపీఏ. మరోవైపు నోటీసులపై అమెజాన్ స్పందించింది. ఈ విషయంలో సెల్లర్ల జాబితాను పరిశీలించాలి చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై తమ పాలసీ ప్రకారం ముందుకు వెళ్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.