ఆంధ్రప్రభ, హైదరాబాద్ : సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రీ లాంచ్ పేరుతో రూ.1800 కోట్లు స్కామ్ చేసినట్లు సిసిఎస్ పోలీసులు తేల్చారు. ఈక్రమంలో సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేశామని, 9 ప్రాజెక్టుల పేరుతో బాధితుల నుంచి పెద్దఎత్తున సాహితీ ఇన్ఫ్రా డబ్బు వసూలు చేసిందని విచారణలో వెల్లడైందని తెలిపారు.
ముఖ్యంగా సాహితీ స్వాద్ పేరుతో రూ.65 కోట్లు, సిస్టాఅడోబ్ పేరుతో రూ.79 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో రూ.40 కోట్లు, సాహితీ సితార పేరుతో రూ.135 కోట్లు.. సాహితీ మెహతో పేరుతో రూ.44 కోట్లు, ఆనంద ఫర్చూన్ పేరుతో రూ.45 కోట్లు, సాహితీ కృతి పేరుతో రూ.16 కోట్లు, సాహితీ సుదిక్ష పేరుతో రూ.22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో రూ.7 కోట్లు వసూలు చేసినట్లు సిసిఎస్ పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
కాగా 9 ప్రాజెక్టుల పేరుతో బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును సంస్థ ఎండి లక్ష్మీనారాయణ తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడంతో పాటు భూములు కొనుగోలు చేయకున్నా ఫ్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా వసూళ్లకు పాల్పడింది. దీంతో సాహితీ స్కామ్ దర్యాప్తునకు సీసీఎస్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ చేపడుతోంది.
స్కీంల పేరిట స్కామ్
సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టిన ప్రతీ వెంచర్‌పై సిసిఎస్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా 2019-2022 మధ్య కాలంలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పేరుతో దాదాపు 1700మంది బాధితుల నుంచి రూ. 530 కోట్ల మేరకు వసూలు చేసినట్లు సిసిఎస్ పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో నానక్‌రాం గూడలోని సాహితీ స్వధ కమర్షియల్ పేరుతో 69మంది నుంచి రూ. 65 కోట్లు, మేడ్చల్-కొంపల్లి అబోద్ పేరుతో 248 మంది నుంచి రూ. 79 కోట్లు అలాగే కొంపల్లిలో సాహితీ గ్రీన్ పేరుతో 153 మంది నుంచి రూ. 40 కోట్లు, గచ్చిబౌలిలో సాహితీ సితార కమర్షియల్ పేరిట 269 మంది నుంచి రూ. 135 కోట్లు, బంజారాహిల్స్‌లో సాహితీ మహెటో సెంట్రో పేరుతో 44మంది నుంచి రూ. 22 కోట్లు, నిజాంపేట ఆనంద్ ఫార్చూన్స్ పేరుతో రూ. 40.50 కోట్లు, మోకిలాలో సాహితీ సుదీక్ష పేరుతో రూ. 22 కోట్లు, బాచుపల్లిలో రూబీకాన్ పేరుతో 43 మంది నుంచి కూ.6,9 కోట్లు వసూలు చేసినట్లు సిసిఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
ప్రత్యేక బృందాలు
సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు నమోదైన విషయం విదితమే. ప్రాజెక్ట్ మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ. 900 కోట్ల మేరకు సాహితీ ఇన్ఫ్రా వసూలు చేసిందన్న ఆరోపణలపై సిసిఎస్ ప్రత్యేక బృందం విచారణ చేపడుతోంది. కాగా ఇప్పటికే ఈ సంస్థ ఎండి లక్షీనారాయణతో పాటు మరో 22మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే.