రష్యా నుంచి భారత చమురు దిగుమతులు వరుసగా మూడోనెలా తగ్గాయి. ఆగస్టులో ఏడు నెలల కనిష్ఠానికి తగ్గాయి. ప్రస్తుతం రోజుకి 1.46 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. జులైలో ఇది 1.91 మిలియన్ బ్యారెళ్లుగా నమోదైంది. భారత చమురు శుద్ధి సంస్థలు ఇరాక్ నుంచి కూడా చమురు దిగుమతులను తగ్గించుకున్నాయి.
జులైలో రోజుకి 8.91 లక్షల బ్యారెళ్ల చమురు రాగా, ఆగస్టులో అది 8.66 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. అయితే, సౌదీ నుంచి దిగుమతులు మాత్రం పెరిగాయి. చమురు రోజుకి 4.84 లక్షల బ్యారెళ్ల నుంచి 8.20 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా చమురుపై ఐరోపా దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
దీంతో రష్యా తక్కువ ధరకే చమురు విక్రయించడం ప్రారంభించింది. దేశ ప్రయోజనాలరీత్యా దీన్ని అదనుగా భావించిన భారత్.. పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది మే నెలలో గరిష్ఠంగా రోజుకి రెండు మిలియన్ బ్యారెళ్లు భారత్‌కు అందాయి. అయితే, వర్షాకాలం నేపథ్యంలో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో దిగుమతులు సైతం తగ్గుతూ వస్తున్నాయి.
మరోవైపు కొన్ని సంస్థలు వార్షిక మరమ్మతులో భాగంగా శుద్ధి ప్రక్రియను పరిమితం చేసుకున్నాయి. ఇది కూడా దిగమతులు తగ్గడానికి ఓ కారణం. మొత్తంగా భారత చమురు దిగుమతులు ఆగస్టులో రోజుకి 4.35 మిలియన్ బ్యారెళ్లకు తగ్గాయి. క్రితం నెలతో పోలిస్తే 7 శాతం తగ్గుదల నమోదైంది. అక్టోబర్ నుంచి చమురుకు డిమాండ్ తిరిగి పుంజుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.