Monday, November 18, 2024

రష్యా టూ యూరోప్‌ వయా ఇండియా.. భారీగా చమురు సరఫరా

ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో అమెరికా, దాని మిత్ర పక్షాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించారు. రష్యా చమురు ఎగుమతులపైనా, ధరలపైనా నియంత్రణలు విధించాయి. చాలా యూరోపియన్‌ దేశాలు రష్యా చమురు, గ్యాస్‌పై ఆధాపడి ఉన్నాయి. ఆంక్షలతో ఈ దేశాల్లో వీటి ధరలు ఆకాశాన్నింటుతున్నాయి. కొరత కూడా తీవ్రంగా ఉంది. 2022 డిసెంబర్‌లో యూరోపియన్‌ యూనియన్‌ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించింది. రెండు నెలల తరువాత శుద్ధి చేసిన ఇంధనాలను కూడా దిగుమతి చేసుకోకూడదని నిషేధాన్ని పొడిగించింది.

భారత్‌ వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా నిషేధం విధించలేదు. ఇలా కొనుగోలు చేసిన చమురును డీజిల్‌, పెట్రోల్‌, ఏవియేషన్‌ ఇంధనంగా మార్చి యూరోప్‌కు ఎగుమతి చేయకుండా కూడా ఎలాంటి ఆంక్షలు, నిషేధం లేదు. రష్యా నుంచి మన దేశం రికార్డ్‌ స్థాయిలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నది. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్‌ స్థాయిలో యూరోపియన్‌ దేశాలకు శుద్ధి చేసిన ఇంధనాలను ఎగుమతి చేస్తోందని బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. రష్యా నుంచి భారత్‌ డిస్కౌంట్‌ ధరకి భారీ స్థాయిలో క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. గతంలో రష్యా నుంచి ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధనాలు నేరుగా యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు వెళ్లేవి, ప్రస్తుతం భారత్‌ నుంచి వెళ్తుతున్నాయని పేర్కొంఇ. అందుకే ఇండియా భారీ స్థాయిలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోందని ప్రముఖ ఇంధన విశ్లేషకుడు విక్టర్‌ కటోనా చెప్పారు.

గతంలో రష్యానే యూరోపియన్‌ దేశాలకు ప్రధాన సరఫరాదారుగా ఉంది. నేడు రష్యా ముడి చమురును నేరుగా యూరోప్‌లోని చమురు శుద్ధి కార్మాగారాలు పొందలేకపోతున్నాయి. ఇప్పుడు పరోక్షంగా భారత్‌ వంటి దేశాల నుంచి తీసుకోవాల్సి వస్తోంది. దీని వల్ల రష్యా ముడి చమురుకు డిమాండ్‌ పెరుగుతున్నది. ఆంక్షలు విధించినప్పటికీ, రష్యా చమురు అమ్మకాలపై ప్రభావం చూపించలేకపోతున్నది. ఇండియా నుంచి యూరోప్‌కు చెందిన రిఫైనరీలు రోజుకు 3,60,000 బెరల్స్‌ చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే కొద్దిగా ఎక్కువగానే ఉందని కాప్లెర్‌ డేటా తెలుపుతున్నది. ఈ సంవత్సరం ఏప్రిలో మన దేశం ప్రతి రోజూ రష్యా నుంచి 20 లక్షల బెరళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇది మొత్తం దేశ అవసరాల్లో 44 శాతంగా ఉంది.

రష్యాపై ఆంక్షలు విధించక ముందు ఇందులో సగం నేరుగా యూరోపియన్‌ దేశాలకు వెళ్లేది. ఏప్రిల్‌ నెలలో యూరోపియన్‌ దేశాలకు మన దేశమే అతి పెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. రష్యా నుంచి చౌకగా చమురు కొంటున్న మన దేశం డీజిల్‌, పెట్రోల్‌ రూపంలో శుద్ధి చేసిన ఇంధనంతో పాటు, అక్కడి రిఫైనరీలకు నేరుగా ముడి చమురును కూడా సరఫరా చేస్తోంది. రవాణా ఖర్చులు పెరిగినప్పటికీ యూరోపియన్‌ దేశాలకు మరో మార్గం లేకపోవడంతో ప్రస్తుతం చమురు అవసరాలకు మన దేశంపై ఆధారపడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement