మన కరెన్సీ రూపాయి బలహీనపడటంలేదని, డాలర్ బలపడుతుందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. డాలర్‌తో మన రూపాయి విలువ దారుణంగా పడిపోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ ఒక్క సంవత్సరంలోనే డాలర్‌తో రూపాయి విలువ 8 శాతం పతనమైంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశానికి హాజరైన ఇండియాకు తిరిగి వచ్చిన ఆర్ధిక మంత్రి విలేకరులతో మాట్లాడారు. భారత ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉందని ఆమె చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం కూడా ఇండియాలో తక్కువగానే ఉందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం డాలర్లలోనే జరుగుతున్నందున డాలర్ బలపడటం వల్ల అన్ని దేశాల కరెన్సీల విలువ తగ్గిందని ఆర్ధిక మంత్రి అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రూపాయి విలువ పడిపోతుందని తాము భావించడంలేదని, డాలర్ రోజురోజుకు బలపడుతుందని చెప్పారు. ఇతర దేశాల కరెన్సీతో పోల్చితే రూపాయి పనితీరు బాగుందన్నారు. శుక్రవారం నాడు మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.35 రూపాయలుగా ఉంది. సోమవారం నాడు ఇది రికార్డ్ స్థాయిలో 82.68 రూపాయలకు పడిపోయింది. రూపాయి విలువ మరింత పడిపోకుండా నిరోధించేందుకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఆర్బీఐ 100బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
మన దేశ విదేశీ మారకం నిల్వలు అక్టోబర్ 7వ తేదీ నాటికి 532.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 642.45 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆర్బీఐ జోక్యం చేసుకుంది. రూపాయి విలువను ఫిక్స్ చేయడానికి కాదని, అదనపు అస్థిరతను అరికట్టేందుకు మాత్రమేనని ఆర్ధిక మంత్రి చెప్పారు. భారత ఆర్ధిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని, సూక్ష్మ ఆర్ధిక ఫండమెంటల్స్ కూడా బలంగా ఉన్నాయని చెప్పారు. విదేశీ మారక నిల్వలు తగినంతగా ఉన్నాయని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. అందు వల్ల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలమని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో సెప్టెంబర్ నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి 7.41 వాతం నమోదైంది. ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపుకు తీసుకు వచ్చేందుక తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఐఎంఎఫ్ సమావేశాల సందర్భంగా ఆర్ధిక మంత్రి అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. పలు దేశాల మంత్రులు, అధికారులతో వివిధ ఒప్పందాలపై చర్చలు జరిపారు.
చాలా దేశాలు బయటి కారణాల వల్లే అధిక ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొంటున్నాయని నిర్మలాసీతారామన్ అభిప్రాయపడ్డారు. మన దేశం కూడా బయటి పరిస్థితుల ప్రభావం వల్లే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం తగిన సమయంలో అనేక చర్యలు తీసుకుందన్నారు. పెరుగుతున్న వాణిజ్యలోటును ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుందని చెప్పారు. నిజానికి ద్రవ్యలోటు పెరుగుతున్నదని ఆమె అంగీకరించారు. మన ఎగుమతులు తక్కవ ఉంటున్నాయని, దిగుమతులు ఎక్కువ అవుతున్నాయి. అందుకే లోటు పెరుగుతూ వస్తోందని చెప్పారు. చాలా దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. చైనా వాణిజ్య లోటు 87 బిలియన్ డాలర్లు ఉందని, ఇండియా వాణిజ్యలోటు 25.71 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు.