Tuesday, November 26, 2024

రూపీ ఢమాల్‌… జీవితకాల కనిష్టానికి పతనం

ఇండియన్‌ కరెన్సీ రోజురోజుకీ బలహీనపడుతోంది. తాజాగా గురువారం నేటి ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో జీవితకాల కనిష్టానికి పతనమైంది. అమెరికా ఫెడరల్‌ బ్యాంకు వడ్డీరేట్లు పెంచిన నేపథ్యంలో భారీ పతనాన్ని నమోదుచేసింది. స్టాక్‌మార్కెట్‌ ఒడిదొడుకులు రూపాయిపై ఒత్తిడిని మరింత తీవ్రం చేశాయి. ట్రేడింగ్‌లో ఒక దశలో రూ.1.24 శాతం నష్టపోయి, డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.80.91 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 90 పైసలు నష్టంతో రూ.80.86 వద్ద స్థిరపడింది. డాలర్‌ మారకం విలువతో రూపాయికి ఇదే రికార్డుస్థాయి కనిష్ట ముగింపు. యూఎస్‌ వడ్డీరేట్ల పెంపుతో డాలర్‌ బలపడటం, ఈక్విటీ మార్కెట్ల బలహీనతలు, చమురు ధరలు స్తబ్దుగా ఉండటం రూపీని ఒత్తిళ్లకు గురిచేస్తున్నది. సాధారణంగా అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి మదుపరులు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. అధికరాబడి కోసం వాటిని అమెరికాకు తరలిస్తారు. ఫలితంగా డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. ఫలితంగా రూపాయిపై ఒత్తిడి పెరిగి బలహీనమయ్యేందుకు దారితీస్తుంది.

రూపాయి క్షీణత వల్ల సామాన్యుడిపై మరింత భారం పడుతుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే, డాలర్లకోసం ఎక్కువ చెల్లించాలి. ముడి సరుకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ విలువ క్షీణత వల్ల దెబ్బతింటాయి. విదేశాల ఉన్నత విద్యనుంచి, పర్యాటకం వరకు ఖరీదవుతాయి.

ప్రత్యేకించి విదేశాల నుంచి ముడి చమురు, బంగారం, వంట నూనెలు, పప్పు దినుసులను దిగుమతి చేసుకుంటున్నాం. డాలర్‌ విలువ పెరగడం వల్ల వాటి ధరలు మరింత పైపైకి దూసుకెళ్తాయని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల్లో వినియోగించే ముడి సరుకు ధరలూ పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు, మన ఐటీ, ఫార్మా రంగాల సంస్థలకు లాభాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement