పండగల సీజన్‌లో సెప్టెంబర్‌లో వాహన రిటైల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అక్టోబర్, నవంబర్‌లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. సెప్టెంబర్‌లో వాహనాల రిటైల్ అమ్మకాలు 11 శాతం పెరిగాయి. వాహనాల తయారీ కంపెనీలు సరఫరాలను పెంచాయి. చిప్ అందుబాటులోకి రావడంతో వాహనాల ఉత్పత్తిని అన్ని కంపెనీలు పెంచాయి. పండగల సీజన్‌లో వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా వాహనాల కంపెనీలు డీలర్లకు సరఫరాలు భారీగా పెంచాయని ఫాడా తెలిపింది. అక్టోబర్, నవంబర్‌లోనూ వాహనాల విక్రయాలు భారీగానే ఉంటాయని తెలిపింది. కొవిడ్ తరువాత ఈ ఏడాది వాహనాల విక్రయాల్లో గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఉందని ఫాడా తెలిపింది. ముఖ్యంగా ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడింది. ట్రాక్టర్లు, కొన్ని త్రిచక్ర వాహనాలు మినహా, ప్రయాణ, వాణిజ్య,
ద్విచక్ర వాహన విక్రయాల్లో క్రితతం ఏడాదితో పోలిస్తే మంది వృద్ధి నమోదైంది.
ఫాడా వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం వాహనాల రిటైల్ అమ్మకాలు 2021 సెప్టెంబర్‌లో 13,19,647 యూనిట్లు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో 14,64,001 వాహనాల విక్రయాలు జరిగాయి. ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు గత సంవత్సరం 2,37,502 జరిగితే, ఈ సంవత్సరం 10 శాతం పెరిగి 2,60,556గా నమోదయ్యాయి. పండగ సీజన్‌లో కొత్త వాహనాల కొనుగోలు చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. సెమికండక్టర్ల సరఫరా పెరగడంతో తయారీలోనూ ఇబ్బందులు తొలగిపోయానని ఆయన చెప్పారు. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న కార్ల విక్రయాలు పెరగడం కూడా మొత్తం వాహనాల అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సెప్టెంబర్‌లో 2,60,556 ప్రయాణీకుల వాహనాలు, 10,15,702 ద్విచక్ర వాహనాలు, 71,233 వాణిజ్య వాహనాల అమ్మకాలు జరిగాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా గత సంవత్సరంతో పోల్చితే 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా ఎంట్రీలెవల్ టూ వీలర్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగడం వల్లే ఇది సాధ్యమైంది. వాణిజ్య వాహనాల అమ్మకాలు గత సెప్టెంబర్‌తో పోల్చితే 19 శాతం పెరిగాయి. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో 53,392 యూనిట్లు ట్రాక్టర్ల అమ్మకాలు జరిగితే, ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో వాటి విక్రయాలు 52,595 యూనిట్లకు తగ్గాయి.
కార్లలో మారుతినే లీడర్
ప్రయాణీకుల వాహనాల అమ్మకాల్లో మారుతి సుజుకీ తన మార్కెట్ ఆదిపత్యాన్ని నిలబెట్టుకుంది. మారుతి గత సంవత్సరం సెప్టెంబర్‌లో 99,276 యూనిట్లను అమ్మితే, ఈ సెప్టెంబర్‌లో 1,03,912 యూనిట్లు విక్రయించింది. తరువాత స్థానాల్లో హ్యుండాయ్ ఇండియా 39,118 యూనిట్లు, టాటా మోటార్స్ 36,435 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
టూవీలర్స్‌లో హోండా
ద్విచక్ర వాహనాల విక్రయాల్లో హోండా మోటార్ సైకిల్స్ లీడ్‌ను కొనసాగిస్తోంది. 2,84,160 హోండా కంపెనీ వాహనాల అమ్మకాలు జరిగాయి. హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలు 2,50,246 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. బజాజ్ ఆటో ద్విచక్ర వాహనాలు 19,474 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. వాణిజ్య వాహనాల్లో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం 28,615 యూనిట్ల అమ్మకాలు జరిగాయని ఫాడా తెలిపింది.