రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 7 శాతానికి పెరిగింది. జులైలో ఇది 6.71 శాతం ఉంటే, ఆగస్టులో 7 శాతానికి పెరిగింది. సోమవారం నాడు ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ నిర్ధేశించుకున్న కనీస స్థాయి 6 శాతం కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం నమోదు కావడం వరసగా ఇది 8వ నెల. ప్రధానంగా ఆహార పదార్ధాల రేట్లు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణంలో పెరుగుదల నమోదైంది. వీటి ధరలు ఆగస్టులో 7.62 శాతంగా ఉన్నాయి. జులైలో వీటి ఆహార పదార్ధాల ధరలు 6.69 శాతంగా ఉన్నాయి. 2021 ఆగస్టులో వీటి ధరలు 3.11 శాతం మాత్రమే ఉన్నాయి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ) పెరగడానికి ప్రదాన కారణం బియ్యం, గోధుమలు, పప్పుల ధరలు పెరగడమే కారణమని ప్రభుత్వం పేర్కొంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మరో వైపు కొన్ని రాష్ట్రాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో పంటల సాగు, ముఖ్యంగా వరిసాగు దగ్గింది. రానున్న నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణంపై ఈ అంశాలు మరింత ఒత్తిడి పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ నవంబర్ కాలంలో ఇది ఎక్కకువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు, పంచదార ఎగుమతులను నిలిపివేసింది. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఉన్నాయి. ఇవి స్థానికంగా ధరలు తగ్గడానికి తోడ్పవచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, స్థానికంగా ఇవి అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఆహార పదార్ధాల ధరలు పెరగడంతో పాటు, పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా అధికంగా ఉండటంతో సామాన్యుడి బడ్జెట్ తలక్రిందులవుతోంది.
ఆర్బీఐ నిర్ధేశించిన 6 శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు మరింత కాలం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికం నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
ద్రవ్యోల్బణం దిగిరాకపోవడంతో ఆర్బీఐ మరోసారి 60 బేసిస్ పాయింట్ల వరకు రెపోరేట్‌ను పెంచే సూచనలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం ప్రస్తుతానికి పెరుగుతున్నప్పటికీ, ఆర్థిక వృద్ధిపై దీని ప్రభావం స్వల్పంగానే ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి వెళ్లే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.