Saturday, November 23, 2024

Google | ప్లేస్టోర్ నుంచి యాప్స్ తొలగింపు.. గూగుల్ చర్యపై కేంద్రం ఆగ్రహం..

గూగూల్‌ ప్లేస్టోర్‌ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. సర్వీస్‌ ఫీజు చెల్లించని కారణంగా గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి కొన్ని ప్రముఖ యాప్‌లను తొలగించింది. దీన్ని కేంద్రం తప్పు పట్టింది. టెక్‌ స్టార్టప్‌ కంపెనీలకు చెందిన యాప్స్‌ను తొలగించడం సరికాదని ఐటీ, టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. వచ్చే వారం ఇరు పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో గూగుల్‌ వెంటనే స్పందించింది.

కొన్ని యాప్స్‌ను ప్లే స్టోర్‌లో పునరుద్ధరించింది. ఇన్ఫోఎడ్జ్‌కు చెందిన ప్రముఖ యాప్‌లు నౌకరీ, 99 ఎకర్స్‌, నౌకరి గల్ఫ్‌, పీపుల్స్‌ గ్రూప్‌ మెర్టిి మోనీ యాప్‌ షాదీ యాప్‌లను శనివారం నాడు గూగుల్‌ పునరుద్ధరించింది. ఆర్ధిక వ్యవస్థకు స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ గుండెకాయ లాంటిదని వైష్ణవ్‌ చెప్పారు. ఇలాంటి స్టార్టప్‌ల తలరాతలను బిగ్‌టెక్‌ కంపెనీలు నిర్ణయించకూడదన్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. యాప్‌లను డీలిస్ట్‌ చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం అంగీకరించబోదని చెప్పారు.

ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టమని, స్టార్టప్స్ కోరుకునే రక్షణ కల్పించడం ముఖ్యమని చెప్పారు. వచ్చే వారు యాప్‌ డెలవపర్లు, గూగుల్‌తో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇరు పక్షాలతో మాట్లాడినట్లు అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. దేశంలో గత పదేళ్లలో బలమైన స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పడిందన్నారు. ఒక లక్ష స్టార్టప్‌లు రూపుదిద్దుకోగా 100 యూనికార్న్‌లు అవతరించాయని చెప్పారు. ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అవతరించారని చెప్పారు. బిగ్‌ టెక్‌ కంపెనీల విధానాలకు అవి బలికాకూడదని చెప్పారు.

ఫీజులపై సీసీఐ ఆదేశాలు…

గూగుల్‌ ప్లే స్టోర్‌లో 15-30 శాతంగా ఛార్జీల వ్యవస్థను తొలగించాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలు జారీ చేయడంతో గూగుల్‌ ప్రస్తుతం 11-26 శాతం ఫీజు వసూలు చేస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో గూగుల్‌ ప్లే స్టోర్‌ను మాట్రిమోనీ డాట్‌ కామ్‌, షాదీ డాట్‌ కామ్‌, ఇన్ఫోఎడ్జ్‌, అనాకడమీ, ఆహా, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్‌, స్టేజ్‌, కుటుంబ్‌, టెస్ట్‌బుక్‌ వంటి పలు కంపెనీలు సవాల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ 10 కంపెనీలు ఫీజులను చెల్లించడంలేదని గూగుల్‌ పేర్కొంది.

- Advertisement -

ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే షాదీ, భారత్‌ మేట్రిమోనీ, బాలాజీ టెలీఫీల్మ్‌కు చెందిన ఆల్ట్‌, ఆడియో ప్లాట్‌ఫామ్‌ కుకు ఎఫ్‌ఎం, డేటింగ్‌ యాప్‌ క్వాక్‌క్వాక్‌, ట్రూలీ మ్యాడ్లీ వంటి యాప్‌లను గూగుల్‌ తొలగించింది. నౌకరీ, కౌకరీ రిక్రూటర్‌, నౌకరి గల్ఫ్‌, 99 ఎకర్స్‌, శిక్షా మొబైల్‌ అప్లికేషన్లను గూగుల్‌ డీలిస్ట్‌ చేసిందని ఇన్ఫోఎడ్జ్‌ తెలిపింది.

భారత్‌లో ఉపయోగిస్తున్న ఫోన్లలో గూగుల్‌ అండ్రాయిడ్‌ ఉన్నవి 94 శాతం ఉన్నాయి. రెండు లక్షల మంది ఇండియన్‌ డెవలపర్స్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ను ఉపయోగిస్తున్నారని, ఇందులో 3 శాతం మంది మాత్రమే సర్వీస్‌ ఫీ చెల్లించాల్సిన వారు ఉన్నారని గూగుల్‌ తెలిపింది. 2020లో పేటీఎం యాప్‌ను గూగుల్‌ తొలగించిన సమయంలోనూ ఇలాంటి వివాదమే ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement