వాల్ట్ డిస్నీ ఇండియా ఆపరేషన్స్‌ను రిలయన్స్ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు వచ్చాయని దీనితో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ కొనుగోలు క్యాష్, స్టాక్ డీల్ రూపంలో ఉండనుంది. అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ తన ఇండియా బిజినెస్‌లో మెజార్టీ వాటాను విక్రయించాలని చాలా కాలం క్రితమే నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివిధ సంస్థలతో చర్చలు జరుపుతోంది.
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, అదానీ గ్రూప్‌తో పాటు అంబానీకి చెందిని రిలయన్స్‌తోనూ చర్చిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే వాల్ట్ డిస్నీ తెలిపింది. వాల్ట్ డిస్నీ ఇండియా బిజినెస్ విలువను 10 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. రిలయన్స్ మాత్రం దీని విలువను 7-8 బిలియన్ డాలర్లుగా లెక్కిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. వాల్ట్ డిస్నీ, రిలయన్స్ మద్య ఒప్పందాన్ని వచ్చే నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మెజార్టీ వాటాల కొనుగోలు పూర్తయిన తరువాత వాల్ట్ డిస్నీ ఇండియా బిజినెస్‌లో మైనార్టీ వాటాను కొనసాగించనుంది. యాజమాన్య హక్కులు మాత్రం రిలయన్స్‌కు దక్కుతాయి. ఇండియా కార్యకాలాపాల విలువ గురించి ఇంకా తుది నిర్ణయం జరగలేదని ఆ వర్గాలు తెలిపాయి. 2022 ఐపీఎల్ హక్కులు పొందిన రిలయన్స్ తన రిలయన్స్ సినిమా ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేసింది.
ఒప్పందం ఉన్న వార్నర్ బ్రదర్స్ డిస్కవీరీ కంపెనీకి చెందిన హెచ్‌బీఓ ఛానెల్ కంటెంట్‌ను ఇండియాలో ప్రసారం చేసే హక్కులను రిలయన్స్ సినిమా దక్కించుకుంది. ఈ ప్రసార హక్కులు గతంలో ఇండియాలో డిస్నీ హాట్ స్టార్‌కు ఉండేవి. ఈ సారి ఐపీఎల్ హక్కులను డిస్నీ హాట్ స్టార్‌కు దక్కకపోవడంతో చందాదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా డిస్నీ స్టార్‌కు భారీగా వీవర్స్ నమోదవుతున్నాయి.
ఆదివారం నాడు జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్‌ను రికార్డ్ స్థాయిలో 43 మిలియన్ల మంది తిలకించారు. ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌ను చూసిన 35 మిలియన్ల కంటే ఇది చాలా ఎక్కువని డిస్టీ హాట్ స్టార్ తెలిపింది. రిలయన్స్‌తో డీల్ దాదాపు పూర్తయిందని, ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత రెండు సంస్థలు అధికారికంగా ప్రకటిస్తాయని ఆ వర్గాలు తెలిపాయి.