Tuesday, November 26, 2024

కేలక్స్‌లో రిలయన్స్‌ 97 కోట్ల పెట్టుబడి.. 20 శాతం వాటా కొనుగోలు

హరిత ఇంధన రంగంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన కేలక్స్‌ అనే కంపెనీలు రిలయన్స్‌ న్యూ ఎనర్జీ 20 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పదం విలువ 97 కోట్లు. కేలక్స్‌ సౌర సాంకేతికత తయారీ, అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సాంకేతిక సహకారం, వాణిజ్యీకరణ కోసం కూడా ఇరు సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరిందని రిలయన్స్‌ తెలిపింది. అత్యాధునిక హరిత ఇంధన ఉత్పత్తికి కేలక్స్‌తో ఒప్పందం దోహదం చేస్తుందని రిలయన్స్‌ తెలిపింది. క్రిస్టలిన్‌ సోలార్‌ మాడ్యూళ్లలో పెరోవ్‌స్కైట్‌ సౌర సాంకేతిక ఉపయోగపడుతుందని పేర్కొంది.

రిలయన్స్‌ జామ్‌ నగర్‌లో సమగ్ర ఫోటో వోల్టాక్‌ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. కేలక్స్‌తో ఒప్పందం వల్ల చౌకగా సోలార్‌ మాడ్యూళ్ల ఉత్పత్తి సాధ్యపడుతుందని పేర్కొంది. ఈ ఒప్పందానికి నియంత్రణా సంస్థల నుంచి ఎలాంటి అనుమతి అవసరంలేదని రిలయన్స్‌ తెలిపింది. ఈ నెల చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించింది. కేలక్స్‌ 2014లో ప్రారంభమైంది. అమెరికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల్లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. సోలార్‌ సాంకేతికత తయారీలో కేలక్స్‌ అరుదైన మూలకాలు అవసరంలేని విధానాన్ని అనుసరిస్తోంది. రిలయన్స్‌ ఇటీవలనే అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పని చేస్తున్న సోలార్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సెన్స్‌హాక్‌లో 79.4 శాతం వాటాలను కొనుగోలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement