Friday, November 22, 2024

తగ్గిన హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో 3.85 శాతంగా నమోదు

హోల్‌సేల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరసగా 9వ నెలలోనూ తగ్గింది. 2023 ఫిబ్రవరిలో టోకు ధరల ద్రవ్యోల్బణ సూచీ 3.85 శాతంగా నమోదైంది. తయారీ వస్తువులు, ఇంధనం, విద్యుత్‌ ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ సూచీ 13.73 శాతంగా ఉంది. ఈ సంవత్సరం జనవరిలో ఇది 4.73 శాతంగా నమోదైంది. ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం మాత్రం జనవరితో పోలిస్తే 2.38 శాతం నుంచి 3.81 శాతానికి పెరిగింది.

ముడి చమురు సహజ వాయువు, ఆహారేతర వస్తువులు, ఆహార ఉత్పత్తులు, ఖనిజాలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ ఆప్టికల్‌ ఉత్పత్తులు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, ఎలక్ట్రికల్‌ పరికరాలు, మోటార్‌ వాహనాల ధరలు తగ్గడంతో ఫిబ్రవరిలో హోల్‌సేల్‌ దవ్యోల్బణం దిగిరావడానికి కారణమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పేర్కొంది.

- Advertisement -

పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 2.59 శాతం, కూరగాయలు మైనస్‌ 21.53 శాతం, నూనె గింజలు మైనస్‌ 7.38 శాతం, విద్యుత్‌, ఇంధన బాస్కెట్‌లో 14.82 శాతం, తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 1.94 శాతంగా నమోదైంది. మరోవైపు ఆహార పదార్ధాలు, ఇంధన ధరలు స్వల్పంగా తగ్గడంతో గత నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.44 శాతంగా నమోదైంది.

వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో 6.52 శాతం కాగా, ఫిబ్రవరిలో కాస్త తగ్గింది. ఆర్బీఐ నిరంతరం ద్రవ్యోల్బణాన్ని పర్యవేక్షిస్తోంది. ద్రవ్య నియంత్రణ విధానాలను రూపొందించేందుకు ఆర్బీఐ ఈ పని చేస్తోంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఇప్పటికే ఆర్బీఐ పలు దఫాలుగా వడ్డీ రేట్లు పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement